వార్తలు

ఎ.యు. ఇంజనీరింగ్ లో 102 కోవిడ్-19 పాజిటివ్ కేసులు

• విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆసుపత్రికి తరలింపు
• నిరంతర వైద్యం, ఆహారం సరఫరా, ఆంబులెన్సులు సిద్దం
• విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనలు చెందవద్దని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు భరోసా

విశాఖపట్నం, మార్చి,28ః విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆసుపత్రికి తరలిస్తారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆంధ్రా యూనివర్సీటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల వసతీ భవనాలలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు వచ్చిన దృష్ట్యా ఆంధ్రా యూనివర్శిటీ సెనేట్ హాలులో శనివారం విలేఖరులతో మాట్లాడారు. ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి విద్యారినీ, విద్యార్థులకు, టీచింగ్, నాన్ టీచింగ్ కు పరీక్షలు చేయగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు 102 వచ్చాయని, ఇందులో విద్యార్థులు( బాయ్స్)-96 మంది, మహిళ-1, సిబ్బంది-5 గురు ఉన్నట్లు చెప్పారు. జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని, పాజిటివ్ వచ్చిన వారికి ఐసోలేషన్ బ్లాక్ లు ఏర్పాటు చేసి, వారికి కోవిడ్ కిట్స్ సరఫరా చేసినట్లు వివరించారు. 24/7 వైద్య సహాయం అందుతుందని, విద్యార్థుల తల్లితండ్రులు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్టులో ఉన్నవారిని గుర్తించి వారిని వేరొక బ్లాక్ లో ఉంచి పర్యవేక్షిస్తుండం జరుగుతుందని, కాని ఎవరికీ కోవిడ్ లక్షణాలు లేవని చెప్పారు. ఆంబులెన్స్లు, మందులు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా కెజిహెచ్ లో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో 550 పడకలు, విమ్స్ లో 650 పడకలు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. సామూహిక ప్రదేశాలలో కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, మాస్క్ విధిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేశారు. అన్ని పి.హెచ్.సి.లు, సి.హెచ్.సి.లలో కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతుందని చెప్పారు.
అంతకు ముందు ఆంధ్రాయూనివర్సిటీ సమావేశ మందిరంలో కోవిడ్ నివారణపై జిల్లా యంత్రాంగం, ఎ.యు. వి.సి.లతో రాష్ట్ర పర్యాటక శా మంత్రి సమీక్షించారు. కోవిడ్ నివారణకు తీసుకున్న చర్యలు, పరీక్షలు, తదితర విషయాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు మంత్రికి వివరించారు. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు వచ్చిన కోవిడ్ పరిస్థితిని ఎ.యు. వి.సి. ఆచార్య ప్రసాద్ రెడ్డి మంత్రికి వివరించారు. ఏ ఒక్క విద్యార్థికి ఇబ్బంది ఉండకూడదని డి.యం.హెచ్.ఓను ఆదేశించారు. నిరంతర వైద్య పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈ సమావేశంలో జి.వి.యం.సి. మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఆర్డిఓ పెంచల కిషోర్, ఎ.యు. రిజిస్ట్రార్ ప్రొ. వి. కృష్ణమోహన్, డిఎంహెచ్ఒ సూర్యనారాయణ, ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, వార్డెన్లు, తదితరులు పాల్గొన్నారు.