టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి: సజ్జల
రాక్షస క్రీడలకు నిలయంగా టీడీపీ కార్యాలయం: ఎమ్మెల్యే రోజా
భారత్ వాయిస్, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి. రెండున్నరేళ్లుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. సీఎం వైఎస్ జగన్‌ను టీడీపీ నేత పట్టాభితో తీవ్ర పదజాలంతో దూషింపజేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు.
టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి: సజ్జల
‘‘చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆయనను ఇలానే దూషిస్తే ఊరుకుంటారా.. చంద్రబాబుకు తెలియకుండా పట్టాభి మాట్లాడతారా’’ అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో సజ్జల పాల్గొన్నారు.
ఈ సదర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు చేసే దీక్ష చూస్తే నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కావడం లేదు. ఆయన దీక్షలకు పట్టుమని పది మంది కూడా స్పందించడంలేదు. బూతులు తిట్టడం అనేది చేతగానివాళ్లు చేసే పని. సీఎం జగన్ సంయమనం పాటించాలని చెప్పారు. అందుకే మా కార్యకర్తలు సహనంగా ఉన్నారు. తల్లుల గురించి ఎవరైనా అవమానకరంగా మాట్లాడతారా’’ అని ప్రశ్నించారు.
‘‘పట్టాభి వ్యాఖ్యలను టీడీపీ నేతలే సమర్థించడం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సీఎంను దూషించడం సరికాదు. టీడీపీ నేతలు ఎన్నిసార్లు దూషించినా మౌనంగానే ఉన్నాం. ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం.. వీధి రాజకీయాలు చేయడానికి కాదు. ప్రజలకు మంచి చేయడానికి ఎందాకైనా వెళ్తాం. టీడీపీ నేతలు.. వినేందుకు ఇబ్బంది పడే మాటలు మాట్లాడుతున్నారు. బూతులు వారే మాట్లాడతారు.. దొంగ దీక్షలు వారే చేస్తున్నారు’’ అని సజ్జల మండిపడ్డారు.
‘‘టీడీపీ డీఎన్ఏలోనే లోపం ఉందేమో.. చంద్రబాబును చూస్తే జాలేస్తోంది.. కోపం రావడం లేదు. పట్టాబి వెనక ఉండి చంద్రబాబు ఇలా మాట్లాడించినట్లు ఉంది. నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. బాబు క్షమాపణ చెప్పకుంటే భవిష్యత్తులో ఇలాంటివే ఎదురవుతాయి. టీడీపీ నేతలు ఎక్కడ కనపడినా నిలదీయండి. సహానానికి కూడా హద్దు ఉంటుంది. టీడీపీ నేతలు హద్దు మీరి ప్రవర్తించారు. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేస్తాం’’ అని సజ్జల తెలిపారు.
రాక్షస క్రీడలకు నిలయంగా టీడీపీ కార్యాలయం: ఎమ్మెల్యే రోజా
టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు. పట్టాభి వ్యాఖ్యలను రోజా తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు, పట్టాభి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టాభిలాంటి వ్యక్తులతో ప్రెస్‌మీట్ పెట్టించిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన తల్లి విజయమ్మను తిట్టించారని మండిపడ్డారు. సీఎం జగన్‌పై పట్టాభి చేత చంద్రబాబు చెప్పించిన అనుచిత వ్యాఖ్యలు.. చంద్రబాబు, లోకేష్‌లపై చేయిస్తే భువనేశ్వరి సంతోషంగా ఉంటారా అని ప్రశ్నించారు. కుట్రపూరిత రాజకీయలకు, రాక్షస క్రీడలకు నిలయంగా టీడీపీ కార్యాలయం మారిందని మండిపడ్డారు.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష చేపట్టారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ విమర్శ చేయవచ్చు కానీ వ్యక్తిగతంగా విమర్శించకూడదని హితవు పలికారు. టీడీపీ కార్యాలయంలో నాలుగులు కుర్చీలు విరగ్గొడితే ప్రజస్వామ్యం ఖూనీ అయిందా అని ఆమె ప్రశ్నించారు. ఎప్పుడైతే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడో అప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్న విషయం చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలన్నారు. తిరుమల వచ్చిన అమిత్ షాపై రాళ్లు వేయించిన చంద్రబాబు సిగ్గులేకుండా అమిత్ షాకు ఫోన్ చేసి రాష్ట్రానికి రావాలనడం సిగ్గుచేటని విమర్శించారు.