వార్తలు

కోవిడ్ నేపథ్యంలో ‘ఘనసన్మానం’

సన్మానగ్రహీత, నిర్వాహకుల మొండి పట్టుదల
ఇదీ జిల్లా వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు తీరు
భయాందోళన చెందుతున్న ప్రజానీకం
కోవిడ్ కేసులు పెరిగే ప్రమాదం
జిల్లా అధికారులు దృష్టి సారించాలి

 

భారత్ వాయిస్ , విశాఖపట్నం :

“నాకు సన్మానాలు, పొగడ్తలు ఇష్టం ఉండవు. ఆ విషయం జిల్లా వైద్యారోగ్యశాఖతో పాటు, తనతో పరిచయం ఉన్న అన్ని వర్గాల ప్రజలకూ తెలుసు. నాకు సన్మానం చేస్తానంటే వద్దన్నాను. మరీ అభిమానం ఉంటే ఒక శాలువా కప్పి పంపించేయండి అని మాత్రమే అన్నాను. మరి సన్మానం పేరిట పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న విషయం నాకు తెలీదు. అలాంటి వాటిని నేను వ్యతిరేకిస్తాను.”… కొన్ని రోజుల కిందట 
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.ఎస్.సూర్యనారాయణ చెప్పిన మాట. మరి ప్రస్తుతం …

పొగడ్తలకూ సన్మానాలకూ లొంగిపోని వ్యక్తులు ఎవ్వరూ ఉండకపోవచ్చు ఈ భూ ప్రపంచంలో. ఇలాంటి వాటిని సున్నితంగా తిరస్కరించిన మహానుభావులు కూడా ఉన్నారు. నేనూ అదే కోవకు చెందుతానంటూ చెప్పే జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ పిఎస్ సూర్యనారాయణ తన జీవితంలో ఇదోక మరపురాని ఘట్టంగా మిగిలిపోతుందనుకున్నారేమో, చివరకు భారీ సన్మానానికి తలొగ్గారు. ఈ నెల చివరినాటికి ఆయన ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని ఘనంగా సన్మానించడానికి కొంతమంది ప్రత్యేక శ్రద్ధతో నడుం బిగించారు. ఇదంతా హర్షణీయమైనదే. జిల్లావాసులను భయపెడుతున్న కోవిడ్ కేసుల నడుమ ఇలాంటి సన్మానాలు నిర్వహించడం ఎంతవరకూ సబబో సన్మాన గ్రహీతకూ నిర్వాహకులకే తెలియాలి. ఈ సన్మాన కార్యక్రమం కోసం కిందస్థాయి సిబ్బంది నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తుండటం ఆక్షేపణగా మారింది. జిల్లాలో ఉన్న 120 పీహెచ్ సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు)లు ఒక్కో దాని నుంచి రూ. 5000 వసూలు చేయడాన్ని చాలామంది విమర్శలు చేస్తున్నారు.
కోవిడ్ సమయంలో ప్రతీ కుటుంబ నెలవారీ బడ్జెట్ తలకిందులయింది. దీంతో అప్పులు పాలైన ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో కోవిడ్ వైరస్ బారినపడి ఆసుపత్రుల పాలై లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగుల నుంచి బలవంతపు వసూళ్లు చేయడం దురదృష్టకరం. డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడని వారిని భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనవలసి ఉంటుందంటూ హెచ్చరికలు జారీ చేయడం కూడా చూస్తుంటే దీనివెనుక పెద్ద హస్తాలే ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగ విరమణ చేసే అధికారికి అంత శ్రద్ధతో సన్మాన కార్యక్రమాలు పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటనే దానిపై పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అధికారి పేరు చెప్పి లక్షలాది రూపాయలను మిగుల్చుకోవడానికేనన్న అభియోగాలు కూడా లేకపోలేదు.
జిల్లా వైద్యారోగ్యశాఖలో భవిష్యత్తులో తమ ఉనికిని మరింతగా బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతోనే కొంతమంది వ్యక్తులు ఈ కార్యక్రమానికి పూనుకున్నారనే వార్తలు కూడా లేకపోలేదు. కార్యాలయంలో జరిగే ప్రతీ వ్యవహారంలోనూ తమ మాటే నెగ్గేలా చేసుకోవడంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని తలో భుజం మీద వేసుకున్నట్లు కొంతమంది నిర్వాహకులపై అభియోగాలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అధికారిననే గర్వం లేకుండా తన ఉద్యోగ బాధ్యతలను నిర్వహించడంలో ఎలాంటి భేషజాలకు పోకుండా, సాదాసీనంగా వ్యవహరించి అందరి అభిమానాలను పొందిన డాక్టర్ సూర్యనారాయణ, సన్మాన విషయంలో నిర్వాహకుల ఒత్తిళ్లకు తలొగ్గి,
పిహెచ్ సి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తోసి రాజనేలా వ్యవహరించడం దురదృష్టకర విషయం. ఒకవేళ ఆయనకు నిజంగానే ఈ ఘన సన్మాన కార్యక్రమం ఇష్టం లేకుంటే మరి ఎందుకు
ఒప్పుకున్నారో ఆయనకే తెలియాలి. ఘన సన్మానం నిమిత్తం జిల్లాలోని పిహెచ్ సిల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే వార్త గుప్పుమనడంతో భారత్ వాయిస్ ఈనెల ” ఉన్నతాధికారికి ఘన సన్మానం.. ఉద్యోగుల నుంచి వసూళ్ల బాదుడు” శీర్షికతో వార్తను ప్రచురించడం జరిగింది. వాస్తవానికి వార్తలు వస్తే చాలామంది అధికారులు, తమకున్న మంచి పేరుకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనన్న భయంతో ఇలాంటి సన్మానాలకు ఒక దండం పెట్టేస్తారు. ” ఉన్నతాధికారికి ఘన సన్మానం.. ఉద్యోగుల నుంచి వసూళ్ల బాదుడు” శీర్షికతో వార్త వచ్చినది మొదలు ఈ వసూళ్ల కార్యక్రమం మరింతగా పుంజుకున్నట్లు తెలుస్తోంది. దీనిబట్టి సన్మాన గ్రహీతలూ, నిర్వాహకులకు ఈ సన్మాన కార్యక్రమం ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందో అర్ధమవుతుందని పలువురు ఉద్యోగులు వ్యాఖ్యానించడం గమనార్హం. అసలే ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవు. కోవిడ్ ప్రభావం తగ్గినప్పటికీ జిల్లాలో కేసులు నమోదు కనిపిస్తోంది.
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారికి ఘన సన్మానం అంటే ఎంత లేదన్నా తక్కువలో తక్కువుగా 1000 మంది ఉద్యోగులు హాజరయే అవకాశం ఉంది. వారిలో ఎవరు కోవిడ్ బాధితులో జనాలకు తెలియదు. ఈ సమూహంలో కోవిడ్ వైరస్ ఒకరి నుంచి మరోకరికి వ్యాపించే ప్రమాదం ఉంది. తద్వారా జిల్లాలోని ప్రజానీకం పెద్దమొత్తంలో కోవిడ్ బారినపడే ప్రమాదం ఉంది. ఇలాంటి కార్యక్రమాలపై జనాలను అప్రమత్తం చేయాల్సిన
జిల్లా వైద్యారోగ్యశాఖే భారీ జన సమీకరణతో ఉన్నతాధికారి ఘన సన్మాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం భయాందోళనలను కలిగిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులైన
జిల్లా కలెక్టరు,
జిల్లా వైద్యారోగ్యశాఖకు ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టరు వంటి వారు ఈ ఘన సన్మాన కార్యక్రమం వలన వస్తున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం నెలకొంది.