వార్తలు

కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా మరియు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్‌ భారత్ లోనే

భారత్ వాయిస్, విశాఖపట్నం , తేది, 3 అక్టోబర్, 2021: కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా మరియు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్‌ను మన కేంద్ర ప్రభుత్వం సమర్ధంగా అమలుచేస్తోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జె ఏ జయలాల్ అన్నారు.ఆదివారం విశాఖ అంకోసా లో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ క్లిష్ట సమయంలో విధులు నిర్వహించిన ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్యసిబ్బంది, మీడియాసిబ్బంది సేవలు మరపురానివన్నారు. కోవిడ్ కారణంగా అనేకమంది వ్యాద్యులు అసువులు బాసారని విచారం వ్యక్తం చేసారు.దేశంలో మొదటిసారిగా ఆరోగ్యశ్రీ పేరుతో దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పధకం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలుచేస్తున్నారని ప్రశంసించారు.దాదాపు మూడు లక్షల ఏభై వేల సభ్యులతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొనసాగుతోందన్నారు.ఆయుర్వేదానికి తాము వ్యతిరేకం కాదని మిక్సోపతి విధానంవలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు.సెక్రటరీ జనరల్ డాక్టర్ జయేష్ లేలే మాట్లాడుతూ వైద్యులు సమాజంలో చేస్తున్న సేవలను ప్రభుత్వం సరిగా గుర్తించటంలేదన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేటు ఆసుపత్రులను వివిధ నిభంధనలతో వేధిస్తున్నాయన్నారు.ఇటువంటి కఠిన నిభందనలతో ఆసుపత్రులను నడపడం కష్టతరంగా మారిందన్నారు.వైద్యులకు సరైన భద్రత లేదని,వైద్యుల తప్పు లేకపోయినా రోగుల బంధువులనుంచి దాడులు తప్పటంలేదన్నారు.వివిధ కారణాలతో ప్రభుత్వాలు అక్రమంగా అరెస్టులు చేస్తున్నాయన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యులకు సరైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేసారు.ఈ సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి డాక్టర్ నంద కిషోర్,కన్వీనర్ డాక్టర్ శ్రీనివాసరాజు,ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విశాఖపట్నం ప్రెసిడెంట్ డాక్టర్ పీ.ఏ.రమణి,కార్యదర్శి డాక్టర్ కే.ఫణిందర్,వర్కింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ విజయ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.