వార్తలు

చంద్రబాబు ఏపీలో తిరిగే హక్కును కోల్పోయారు

బాబు మాటలను జనాలు నమ్మే స్థితిలో లేరు

రాష్ట్రానికి ఆయన చేసిందేంటి
చంద్రబాబు పై ద్వజమెత్తిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్

(భారత్ వాయిస్, విశాఖపట్నం): తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగే హక్కును కోల్పోయారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ ధ్వజమెత్తారు. సోమవారం విశాఖనగరలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తుడిచి పెట్టుకు పోయిందని, ఇక ఆ పార్టీ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయినట్లేనని ఎద్దేవా చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జీవీఎంసీ పరిధిలోని నాలుగు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే, 2021 సంవత్సరంలో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లోని అత్యధిక కార్పొరేటర్ స్థానాల్లో వైకాపా విజయకేతనం ఎగురవేయడం ముఖ్యమంత్రి జగన్ సుపరిపాలనకు స్థానికుల నుంచి ఎలాంటి స్పందనో ఈ ఎన్నికలు ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. చంద్రబాబు నగరంలో ప్రచారాలు నిర్వహించినప్పటికీ స్థానిక ప్రజానీకం ఆయన మాటలను నమ్మకుండా వైఎస్సార్ పార్టీకి రెడ్ కార్పెట్ పరిచిందనే విషయం స్పష్టమౌతోందన్నారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన అనంతరం వచ్చిన ఫలితమిదని అన్నారు. గ్రేటర్ పరిధిలోని సుమారు 18 లక్షల మంది ఓటర్లు వైకాపా పార్టీకి అండగా నిలబడటంపై తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలను సాధించడం వెనుక కర్త, కర్మ, క్రియ అన్నీ తానై వ్యవహరించిన ఉత్తరాంధ్ర వైకాపా ఇన్‌ఛార్జి విజయసాయిరెడ్డికి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నట్లు అమర్ తెలిపారు. మున్సిపోల్స్ సందర్భంగా ప్రచారం నిమిత్తం విశాఖలో పర్యటించిన చంద్రబాబు మూడు రాజధానుల అంశానికి రిఫరెండమ్ గా ఈ ఎన్నికలు నిలుస్తాయని అన్నారు. మరి ఈ ఫలితాలను బట్టి ప్రజల మనసుల్లో ఏముందో చంద్రబాబు గ్రహించుకోవాలని చురకలు అంటించారు. అమరావతి ప్రాంతంలోని సర్పంచ్ స్థానాలను, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లలో వైకాపా జెండా ఎగరడం బట్టి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ఎంపిక చేయడం అయా వర్గాలు అన్నీ సుముఖంగానే ఉన్నట్లు స్పష్టమౌతోందన్నారు. రాజధాని విషయంలో సుమారు సంవత్సరం కాలానికి పైగా అమరావతి ప్రాంతంలో చేస్తున్న ఆందోళనలన్నీ చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలుగా తేలిపోయిందని ఎద్దేవా చేశారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను వ్యతిరేకించిన చంద్రబాబుకు అసలు విశాఖలో పర్యటించే హక్కే లేదని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో వైకాపా ఇచ్చిన హామీలను గడచిన 20 నెలల కాలంలో పూర్తిగా అమలు చేయడం వలనే మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారనే విషయాన్ని చంద్రబాబు గ్రహించాలని సూచించారు. సిఎం జగన్ అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకూ అభివృద్ది కార్యక్రమాలకు జనాలు మెచ్చి కృతజ్ఞతతో వైకాపాకు గొప్ప విజయాలను అందిస్తున్నారని అన్నారు. వైకాపా విజయాలను ఏమాత్రం అంగీకరించిన స్థితిలో చంద్రబాబు ఉన్నారని వెటకారం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు ఉండవు కాబట్టి వైకాపా విజయాలను కూడా తమ విజయాలుగా చెప్పుకొని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబుకు పార్టీ గుర్తులతో జరిగిన మున్సిపోల్స్ ఫలితాలతో దిమ్మ తిరిగిందంటూ ఎద్దేవా చేశారు. ఇకనైనా చంద్రబాబు వైకాపా విజయాలను అంగీకరించాల్సి ఉందన్నారు. ఇంకా ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే, వారేమీ తెలివితక్కువ కారనే విషయాన్ని ఎన్నికల ఫలితాలను చూసైనా గ్రహించాలని అమర్ హితవు పలికారు. ఇప్పుడు జనాల ముందుకు వచ్చి ఏమి మాట్లాడాలో తెలియని స్థితిలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో వైకాపా ఘనవిజయం సాధిస్తే, ఈవీఎం మిషన్లను టాంపరింగ్ చేసేశారని చంద్రబాబు గగ్గోలు పెట్టాడు. మరి మున్సిపోల్స్ లో బ్యాలెట్ పేపర్ ను కూడా మాయ చేసేశారని చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ గగ్గోలు పెడతారా అని ప్రశ్నించారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసినదేమిటని ప్రశ్నించారు. ఏం చేశారని ప్రజలను ఓటు వేయండని అడుగుతారని ధ్వజమెత్తారు. విశాఖ విషయానికి వస్తే హుదూద్ సమయంలో ఇది చేశానూ, అది చేశాను అంటూ ప్రగల్భాలు పలకడం తప్ప ఏమీ లేదని అన్నారు. హిందుస్థాన్ జింక్ ను అమ్మేయడం, స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేయడానికి ఎన్డీయేలో కన్వీనర్ గా ఉంటూ ముందడుగు వేయడం, బిహెచ్ పివిని ఒక కేంద్రమంత్రితో కలిసి సొంతం చేసుకోవడానికి ప్రయత్నించడం, హిందుస్థాన్ షిప్ యార్డు నష్టాల్లోకి వెళ్లిపోతే, దానిని అమ్మేసేందుకు ప్రయత్నించం నిజం కాదా అని ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖకు చేసిన మేలు ప్రజలందరికీ ఇప్పటికే గుర్తెనని అన్నారు. ఆరిలోవలో హెల్త్ సిటీ ఏర్పాటు, స్టీల్ ప్లాంట్ విస్తరణ, బిహెచ్ పెవీని బిహెచ్ ఈఎల్ లో విలీనం, రుషికొండలోని ఐటీ, చుట్టుపక్కల బిఆర్ టీసీ రోడ్ల ఏర్పాటు తదితరవన్నీ ఆయన కాలంలోనే జరిగాయన్నారు. మరి నీ ముఖ్యమంత్రి కాలంలో విశాఖకు చేసిందేమిటంటూ ద్వజమెత్తారు. హుదూద్ సోది తప్ప ఇంకోటి నీ నోటి నుంచి రాదా అని ప్రశ్నించారు. హుదూద్ లాంటి సమయంలో ఏ ముఖ్యమంత్రి అయినా అదే చేస్తాడు. మరి నీ గొప్పతనం ఏంటి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విశాఖలో రైల్వేజోన్ కోసం తామంతా ఆందోళనలు జరుపుతుంటే, నీ ఎంపీల చేత ఎలాంటి లేఖలు రాయించావో అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. విశాఖ తుఫాను తీరప్రాంతమని, అక్కడ ఏం చేసినా నష్టమేనంటూ కేంద్రానికి లేఖలు రాయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. విశాఖలో పార్టనర్ సమిట్లు పెడతావు..అక్కడకొచ్చిన కంపెనీల యాజమాన్యాలను అమరావతి ప్రాంతం వైపు మొగ్గు చూపించేలా తెరవెనుక వ్యవహారాలు చేస్తావంటూ చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. ఇక్కడి వనరులను వాడుకోవడం తప్పా, విశాఖకు ఎన్నడైనా న్యాయం చేశావా అని ధ్వజమెత్తారు. తన సొంత జిల్లాలో ఏ ఒక్క మున్సిపాల్టీని గెలుచుకోలేకపోయిన చంద్రబాబుకు రాష్ట్రంలో ఓటు ఎందుకు వేయాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి రవిరెడ్డి, సిఇసి సభ్యులు శ్రీకాంత్ రాజ్, రాష్ట్ర మత్స్యశాఖ కార్పొరేషన్ డైరక్టర్ పేర్ల విజయచంద్ర, రాష్ట్ర అయ్యారిక కార్పొరేషన్ డైరక్టర్ కె.రామన్నపాత్రుడు, విశాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లంపల్లి రాజబాబు తదితరులు పాల్గొన్నారు.