వార్తలు

జాతీయ ఉపాధ్యాయ అవార్డుగ్రహీత శ్రీధర్‌కు సత్కారం

అవినీతిరహిత సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులే కీలకం
మాజీ ఎమ్మెల్యే ‘పల్లా’

భారత్ వాయిస్, విశాఖపట్నం : అవినీతి లేని సమాజ నిర్మాణంలో కీలక పాత్ర ఉపాధ్యాయులదేనని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం బాధ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగ్రహీత కొణతాల ఫణిభూషణ్‌ శ్రీధర్‌ను దుశ్శాలువ, జ్ఞాపికతో సోమవారం అనకాపల్లిలో ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ మంచి బోధన అనేది మంచి సమాధానాలు చెప్పడం కాదు … మంచి ప్రశ్నలు అడిగేలా యువతను తీర్చిదిద్దడమన్నారు. పుస్తకం, కలము, ఉపాధ్యాయున్ని గుర్తుపెట్టుకుంటేనే జీవితంలో మార్పు వస్తుందన్నారు. వ్యాపారాలు చేయడం కంటే బోధించే పని ఎంతో ప్రతిఫలదాయకమన్నారు. ఉన్న స్ధానం నుంచి ఉన్నత స్ధానానికి చేర్చేది, అజ్ఞానం అనే చీకట్లను తొలగించి విజ్ఞాన జ్యోతులు వెలిగించే వారు ఉపాధ్యాయులన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత అక్షరాలుదిద్దించిన గురువుకే భారతీయ సమాజం పెద్దపీట వేసిందన్నారు. ఆన్‌లైన్‌ పాఠాల సంస్కృతి పెరుగుతున్నా బోధన ద్వారా లభించే జ్ఞానమే అధికమని, ‘టెక్నాలజీ విద్యా బోధనలో ఒక సాధనం మాత్రమేనని దీన్ని యువత గుర్తించాలన్నారు. విద్యార్ధుల్లో నైపుణ్యాలను వెలికితీయడంలో ఉపాధ్యాయుల పాత్రను తెలియజేస్తోంది.ఉపాధ్యాయులు సమాజం మీద ప్రగాఢమైన ప్రభావాన్ని కలిగిస్తారన్నారు. ఉపాధ్యాయులకు సమాజాన్ని సమూలంగా మార్చగల సత్తా ఉందన్నారు. ఫలితంగా సామాజిక నియమాలు, విలువలు మారుతాయన్నారు. యువత జీవితాల్లో గొప్ప ప్రభావాన్ని చూపించాలంటే … నిబద్ధత ఉన్న వృత్తి ఉపాధ్యాయ వృత్తి మాత్రమేనన్నారు. ఉపాధ్యాయులు అందించిన సేవలకు అవార్డులతో ప్రొత్సహించడం ఎంతోమందికి స్ఫూర్తిని కల్గిస్తుందన్నారు. మానవత్వానికి, ప్రకృతికి అర్థం చెప్పే ఆజీవన ప్రక్రియ విద్య అయితే వ్యక్తిత్వ నిర్మాణం, విలువలు, నైతిక, నిస్వార్థ జీవన విధానాలను అలవరచడం, సామాజిక అభివృద్ధికి దోహద పడడంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆ దిశలో నిత్యం పనిచేస్తూ గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటిన కొణతాల ఫణిభూషణ్‌ శ్రీధర్‌ మాస్టారుకు జాతీయ స్ధాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కడం రాష్ట్రానికి గర్వకారణమని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.