వార్తలు

జిల్లాలో పోలింగ్ ప్రశాంతం

* ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేవు*

వృద్ధులు, వికలాంగులు పోలింగ్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు
జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధారిటీ వి. వినయ్ చంద్


(భారత్ వాయిస్, విశాఖపట్నం) ఏప్రిల్ 8: జిల్లాలో పోలింగు ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధారిటీ వి. వినయ్ చంద్ పేర్కొన్నారు. గురువారం సబ్బవరం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోలింగు సరళిని ఆయన పరిశీలించారు. ముందుగా పోలింగు కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి పోలింగ్ అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లుతో మాట్లాడుతూ గుర్తింపు కార్డులు ఏమి తీసుకువస్తున్నారని, పోలీంగు ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి ప్రత్యేక అధికారులు, ఆర్.ఓ., తహసీల్దార్, ఎంపీడీవో లతో మాట్లాడి పలు సూచనలు జారీ చేశారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లు స్ట్రాంగ్ రూంలలో భద్ర పరచాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఎంపిటిసి, జడ్పీటీసీ పోలింగు ప్రశాంతంగా జరిగిందని, జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటలు వరకు, మైదాన ప్రాంతంలో సాయంత్రం 5 గంటల వరకు జరిగినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలు ఓటర్లకు అతి దగ్గరగా ఏర్పాటు చేయడమైనదని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్పారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వృద్ధులు, వికలాంగులు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు ముందుగా ఉన్న ఆశా కార్యకర్తలను ఏమి చేస్తున్నారని కలెక్టర్ అడుగగా ఓట్లు వేయడానికి వచ్చే ఓటర్లను ధర్మల్ స్కానర్ తో చూసి, శానిటేషన్ చేస్తున్నట్లు ఆశా కార్యకర్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం ప్రత్యేక అధికారి హేమలత, సబ్బవరం మండలం ప్రత్యేక అధికారి పెంటోజిరావు, రిటర్నింగ్ అధికారి ఎం నాగమల్లేశ్వరరావు, సబ్బవరం మండలం తహసీల్దార్ రమాదేవి, ఎంపిడిఓ రమేష్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.