వార్తలు

జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు గ్రిన్ సిగ్నల్

భారత్ వాయిస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గత ఏడాది జరగాల్సిన ఎన్నికలకు ఇప్పటివరకూ ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోయింది. దీంతో ఈ నెల 8వ తేదీన యథావిధిగా జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఈ ఎన్నికల నోటిఫికేషన్ పై తెలుగుదేశం పార్టీ హైకోర్టులో వాజ్యాలను దాఖలు చేయడం, దాని పై హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దు చేయడంతో మళ్లీ అడ్డంకులు ఏర్పడినట్లయింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్లింది. గురువారం జరగబోయే ఎన్నికలకు డివిజన్ బెంచ్ తీర్పు ఎప్పుడొస్తుందానే ఉత్కంఠత ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లోనూ, రాష్ట్ర ప్రజానీకంలోనూ నెలకొంది. బుధవారం ఉదయం 11 గంటల లోపు వస్తుందనుకున్న తీర్పు కోసం మధ్యాహ్నం వరకూ ఎదురు చూడాల్సి రావడంతో మళ్లీ ఈ ఎన్నికలకు గ్రహణం పట్టేలాగ ఉందని అంతా భావించారు. అయితే మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువడటంతో కథ సుఖాంతం అయినట్లయింది. అయితే కౌంటింగ్ ప్రక్రియను మాత్రం నిలిపివేయాలని ఆ తీర్పులో పేర్కొంది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకూ కౌంటింగ్ చేపట్టగూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.