భారత్ వాయిస్, విశాఖపట్నం :
ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ రైల్ యూజర్స్ కన్సల్టటేటివ్ కమిటీ (డీఆర్యుసీసీ) సభ్యునిగా వినియోగదారుల హక్కుల రక్షణ, సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టాల ఉద్యమకర్త, రాష్ట్ర అవార్డుగ్రహీత కాండ్రేగుల వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు (నెం. డబ్ల్యుసీఇ/2/డీఆర్యుసీసీ/2020-2021 తేది : 13-10-2021) జారీ చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్ఎం ఛైర్మన్గా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో వివిధ రంగాలకు చెందిన 25 మంది ప్రతినిధులు ఉంటారు. గడచిన 31 ఏళ్లుగా వినియోగదారుల రక్షణ చట్టం, 15 ఏళ్లుగా సమాచార హక్కు చట్టం అమలు, చట్టాన్ని ఎక్కువ సంఖ్యలో ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం, ఉచితంగా దరఖాస్తులు పంపిణీ, పుస్తకాలు ప్రచురణల ద్వారా ఉద్యమ వ్యాప్తికి ఆయన తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటరమణ భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్వైకెఎస్`యువత కార్యక్రమాలు) రాష్ట్ర సలహా కమిటీ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (విద్యుత్ నియంత్రణ మండలి) రాష్ట్ర సలహా కమిటీ సభ్యునిగా, రాష్ట్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ కమిటీ సభ్యునిగా, సమాచార హక్కు చట్టం అమలు, పర్యవేక్షణ జిల్లా కమిటీ సభ్యునిగా, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ విశాఖపట్నం జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యునిగా, వినియోగదారుల రక్షణ మండలి సభ్యునిగా, పబ్లిక్ ఫోరం రాష్ట్ర నమన్వయకర్తగా, జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షునిగా, అనకాపల్లి మండల కన్స్యూమర్స్ కౌన్సిల్ కార్యదర్శిగా, సమాచార హక్కు చట్టం, వినియోగదారుల రక్షణ చట్టం రిసోర్స్పర్సన్గా, కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్ధల నుంచి ఇంత వరకు 35 పర్యాయాలు అవార్డులు, ప్రశంసాపత్రాలు ఆయన పొందారు. కాగా వెంకటరమణ నియామకం పట్ల సమాచార హక్కు, వినియోగదారుల సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ రైల్వే ప్రయాణికుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, క్షేత్ర స్ధాయిలో మెరుగైన సేవలందించడానికి, సిటిజన్ ఛార్టర్ అమలుకు కృషి చేస్తానని తెలిపారు.