వార్తలు

తప్పుడు వార్తలను నమ్మవద్దు : ఏపీలో నైట్ కర్ఫ్యూ లేదు

భారత్ వాయిస్, విశాఖపట్నం : ఇటీవల కాలంలో తప్పుడు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇందుకు సోషల్ మీడియానే ప్రధాన వేదికగా మారుతోంది. ఇలాంటి తప్పుడు వార్తలను ఎందుకు చేస్తున్నారనేది సంబంధిత వ్యక్తులకే తెలియాలి. ముఖ్యంగా ప్రజలను భయభ్రాంతులు చేసే వార్తలను ప్రచారం చేయడంలో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు కీలకపాత్ర పోషిస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సోషల్ మీడియా వలలో అమాయక ప్రజలు చిక్కుకుంటున్నారు. తెలిసిన వారికి వాటిని సోషల్ మీడియాలోకి పోస్టు చేస్తూ తమకు తెలియకుండానే సమస్యల వలలో చిక్కుకుంటున్నారు. ఇందుకు మీడియా వాట్సప్ గ్రూపులలోని సభ్యులు కూడా అతీతం కాదనేది సుస్పష్టం. ముఖ్యంగా కరోనా కాలంలో ఇలాంటి పోస్టులకు ఎనలేని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ రూపంలో కోవిడ్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. కోవిడ్ 19 సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కారణంగా భారతదేశ ప్రజలు గుండెలు మీద చేయి వేసుకొని హాయిగా ఉన్నారు. అయినప్పటికీ ఇలాంటి వారిని కాస్త భయాందోళనకు గురిచేయడం ద్వారా కొంతమంది సైకోల్లాగా వ్యవహరిస్తున్నారు. దొరికిన ప్రతీ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని ఇటు ప్రజలను అటు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉండటంతో ఆయా వార్తలపై ప్రజలు మిక్కిల భయంతో కాలం వెల్లదీస్తున్నారు. ఇలాంటి పరిస్తితిలో గత 24 గంటల్లో ఒక వార్త హల్ ఛల్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిందనీ, దానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు రూపొందించిందంటూ సోషల్ మీడియాలో హల్ లో చేసింది. దీంతో అమాయక ప్రజలంతా వీటిని ముమ్మరంగా పోస్టు చేస్తూ ఈ గ్యాసిప్ వార్తల ప్రవాహంలో వారూ పాత్రధారులు అయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వదంతులు పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గానే దృష్టి సారించింది. తప్పుడు మెస్సేజ్ లు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసు యంత్రాగానికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఎలాంటి నైట్ కర్ఫ్యూ లేదంటూ అధికారులు సోషల్ మీడియాలోనే పేర్కొంటున్నారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే మంచికీ చెడుకీ సోషల్ మీడియానే ప్రధాన పాత్ర కావడం దురదృష్టకరం. ఇలాంటి వార్తలను మొట్టమొదటసారిగా పోస్టు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే ఇలాంటి వాటికి చెక్ పెట్టవచ్చని ప్రజలు విశ్వసిస్తున్నారు.