వార్తలు

దాడికి దక్కేనా… ఎమ్మెల్సీ

 

సీనియార్టీకి గుర్తింపు లభించేనా.

ఎమ్మెల్సీ రేసులో కళ్యాణీ, వంశీలకే తొలి ప్రాధాన్యం

భారత్ వాయిస్, విశాఖపట్నం : ఎమ్మెల్సీ ఎన్నికలు ఆశావహులను ఊరిస్తున్నాయి. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా సేవలు చేసిన పప్పల చలపతిరావు, బుద్ధ నాగజగదీశ్వరరావుల పదవీ కాలం పూర్తయి చాలా కాలమైంది. వారి స్థానంలో ఇద్దరిని ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రెండు స్థానాలూ వైకాపాకే దక్కే అవకాశం ఉంది. దీంతో ఆ పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. అయితే ప్రస్తుతానికి తెర మీదకు ఐదుగురు పేర్లు విశేషంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు దాడి వీరభద్రరావు. ఒకప్పటి సీనియర్ రాజకీయ నేత దాడి వీరభద్రరావు పేరు మళ్లీ తెరమీదకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ తరుపు నుంచి ఎమ్మెల్సీగా ఆరు సంవత్సరాలు పాటు పెద్దల సభలో తన హవాను కొనసాగించిన దాడి, మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నికయేందుకు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న ఈ రాజకీయ దురంధరుడికి వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్ కరుణిస్తారో లేక రిక్త హస్తం చూపుతారో చూడాల్సిందే.

నాణానికి బొమ్మ, బొరుసు ఉన్నట్లే, ఎమ్మెల్సీగా దాడి రీఎంట్రీకి అనుకూల ప్రతికూల పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా అనుకూల పరిస్థితుల విషయానికి వస్తే… దాడి వీరభద్రరావుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. టిడిపి వ్యవస్థాపక అద్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో మంత్రి పదవులను కూడా సమర్ధవంతంగా నిర్వహించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరు సంవత్సరాలు పాటు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఒక విధంగా చెప్పాలంటే వైకాపాలో దాడి అంతటి అనుభవమున్న నాయకుడు విశాఖ నుంచి లేరనే చెప్పాలి. విశాఖ జిల్లా నుంచి ఎమ్మెల్సీ పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్, సీతంరాజ్ సుధాకర్, డీవీ సూర్యనారాయణరాజు, వరుదు కళ్యాణి తదితరులంతా పోటీ పడుతున్నప్పటికీ, వీరంతా దాడి రాజకీయ అనుభవం ముందు దిగదుడుపేనని చెప్పాలి. పెద్దల సభలో తెలుగుదేశం పార్టీకి చెమటలు పట్టించాలంటే దాడికి మాత్రమే సాధ్యమవుతందనడంలో అతిశయోక్తి లేదు. ఇదంతా నాణానికి ఒకవైపు. ఇక మరోవైపు చూస్తే.. కొన్ని సంఘటనలు దాడి రీ ఎంట్రీకి అడ్డంకులుగా మారుతున్నాయనే చెప్పాలి. టిడిపి తరుపున ఎమ్మెల్సీగా ఆరు సంవత్సరాలు కాల పరిమితి ముగిసిన పిదప, మరోసారి తన పేరును ఎమ్మెల్సీ స్థానానికి పరిగణించకపోవడంతో మనస్థాపానికి గురైన దాడి దేశం పార్టీకి రాంరాం చెప్పి వైకాపాలో చేరారు. ఆ తర్వాత ఇతరత్రా కారణాల వలన వైకాపాను వీడి దేశం గూటికి చేరారు. ఆ సమయంలో ఒక పత్రికా సమావేశంలో వైకాపా అధినేత జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవన్నీ యూ ట్యూబ్ లో ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. ఈ వీడియోనే దాడి రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకిగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కొన్ని నెలలు కిందట దాడి తనయుడు రత్నాకర్ కి ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కనున్నట్లు పత్రికల్లో వార్తలు వెల్లువెత్తాయి. అయితే ఏ కారణం చేతనో అతని స్థానంలో మరోకరిని నియమించడం జరిగింది. దీనికి కారణం కూడా ఈ యూ ట్యూబ్ వీడియోనని వైకాపా వర్గీయుల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడూ కూడా ఇదే వీడియో దాడి విషయంలో ప్రతిబంధకంగా మారే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకో విషయం ఏమిటంటే, త్వరలోనే మంత్రివర్గ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పుల్లో అనకాపల్లి ఎమ్మెలే గుడివాడ అమర్‌నాథ్ కు నూటికి తొంభై తొమ్మిది శాతం మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే, అనకాపల్లి ప్రాంతానికి మంత్రి పదవి, ఎమ్మెల్సీ పదవులు వచ్చే అవకాశం లేదనే చెప్పాలి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం ప్రస్తుతం దాడి కుటుంబం అంతా వైకాపా వైపే ఉంది. 2019 ఎన్నికల్లో అనకాపల్లి టికెట్ ను ఆశించి భంగపడినప్పటికీ, పార్టీ టికెట్ దక్కించుకున్న గుడివాడ అమర్ నాథ్ గెలుపునకు తీవ్రంగా కృషి చేయడంలో దాడి వీరభద్రరావు, అతని కుమారులైన రత్నాకర్, జయవీర్లు పార్టీ అభిమానాన్ని చూరగొన్నారు. మరి దాని ప్రభావం ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకోవడంలో దాడి ఏమేరకు సఫలీకృతులవుతారో చూడాలి. ఫ్లాష్ న్యూస్ ప్రకారం కళ్యాణి, వంశీలకు ఎమ్మెల్సీలు ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దాడి తన రాజకీయ అనుభవాన్ని రంగరించి జగన్ ను తనవైపు ఏవిధంగా తిప్పుకొని లాభపడతారో చూడాలి.