వార్తలు

నేనే రాజు… నేనే మంత్రి

మెంటల్ ఆసుపత్రిలో ఒక ఉన్నతాధికారి తీరు దిగువ స్థాయి సిబ్బందిపై పైశాచికానందం
14 మంది సరెండరకు చర్యలు – వ్యతిరేకించిన డైరక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
నిబంధనలకు విరుద్ధంగా నిధుల ఖర్చుకు ఉద్యోగులపై ఒత్తిడి
సిఎస్ ఆర్ఎంఓకు తప్పని వేధింపులు
అధికారి తీరుపై మానసిక ఆందోళనతో నర్సింగ్ సూపరింటెండెంట్ల ఆవేదన
శత పతీ… ఏమిటీ అధోగతీ…అంటున్న ఉద్యోగ వర్గాలు
భారత్ వాయిస్, విశాఖపట్నం :

విశాఖపట్నం మెంటల్ ఆసుపత్రిలోని ఒక ఉన్నతాధికారి తీరు ” నేనే రాజు – నేనే మంత్రి ” అన్నట్లుగా ఉంది. ఇష్టానుసారంగా ఉద్యోగులను సరెండర్ పేరుతో భయాందోళనలకు గురి చేయడం, నిదుల ఖర్చు విషయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తన ఆజ్ఞలనే పాటించాలని సబంధిత ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడం, సూపరింటెండెంట్ తర్వాత అంతటి ప్రాధాన్యత గల సిఎస్ ఆర్ఎమ్ ఓను, నర్సింగ్ సిబ్బందిని మానసిక ఇబ్బందులకు గురి చేయడం వంటి చేష్టలకు పూనుకోవడం ఆసుపత్రి పాలనపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
“ఆసుపత్రి ఉన్నతాధికారి పిచ్చి చేష్టలతో మేము తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నాము. మా ఉద్యోగ భద్రత దినదినగండంగా మారింది. రేపు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఉద్యోగ బాద్యతలు సక్రమంగా నిర్వహించలేక పోతున్నాము. దీని ప్రభావం రోగులకు అందించే సేవలపై పడే ప్రమాదం ఉంది. ఆందోళన కార్యక్రమాలు తప్ప మాకు వేరే ప్రత్యమ్నాయం కనిపించడం లేదు. అయితే రోగులను దృష్టిలో ఉంచుకొని ఆ సాహసానికి ఒడిగట్ట లేకపోతున్నాము. శతపతి ….మా’ఆసుపత్రికి ఏమిటి ఆథోగతి … అని భావించి మా వ్యధలను వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకూ జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించుకోవాలని అనుకుంటున్నాము”…. అంటూ ఉద్యోగ వర్గాలు మీడియా ముందు వాపోతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే…
దేశంలోనే మంచి గుర్తింపు గల విశాఖపట్నంలోని మెంటల్ ఆసుపత్రిలో గత నెల రోజులకు పైగా అస్తవ్యస్తత వాతావరణం నెలకొంది. ఆసుపత్రి ఉన్నతాధికారి అయిన సూపరింటెండెంట్ రామానంద శత పతికీ దిగువ స్థాయి సిబ్బందికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఏడాది జూలై 13 వ తేదీన సూపరింటెండెంట్ గా రామానంద శత పతి బాద్యతలు స్వీకరించారు. ఆసుపత్రిని దేశంలోనే నెంబరు ఒన్ గా మార్చాలనే సద్భుద్ధితో కొన్ని చర్యలకు ఉపక్రమించారు. అయితే ఆ చర్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉండటం, సిబ్బందిని మానసిక ఆందోళనకు గురి చేసేలా ఉండటంతో సూపరింటెండెంట్ కు సిబ్బందికి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సిఎస్ ఆర్ఎంఓ విషయానికి వస్తే ఆసుపత్రి నిర్వహణలో ఈ పోస్టు చాలా కీలకమైనది. ఒక విధంగా చెప్పాలంటే సూపరింటెండెంట్ తర్వాత అంతటి కీలక పోస్టు అని చెప్పవచ్చు. జాబ్ చార్ట్ విషయంలో సూపరింటెండెంట్ కూ , సిఎస్ ఆర్ఎమ్ ఒలకు వేర్వేరుగా ఉంటుంది. అయినప్పటికీ తనకు సిఎస్ ఆర్ఎంఓ పోస్టు వద్దనీ, అందుకు బదులుగా డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులో ఒకరిని నియమించాలని డిఎమ్ ఇ ( డైరక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ) అధికారులకు విన్నవించుకోవడం అనేది ఆసుపత్రి పరిపాలన విషయంలో ఆయనకు ఎంతటి పరిజ్ఞానం ఉందనేది అర్ధమవుతుంది. అలాగే నిధుల ఖర్చు విషయంలో క్లాసిఫికేషన్ ఉంటుంది. ప్రభుత్వం పంపిన దాని ప్రకారమే నిధులను ఖర్చుచేయాలి. అలా కాకుండా నిధులను ఖర్చుచేస్తే భవిష్యత్తులో ఆడిట్ అభ్యంతరాలకు సంబంధిత ఉద్యోగులు తల వంచుకోవాల్సి వస్తుంది. అసలు విషయం ఏమిటంటే సెప్టెంబరు నెలాఖరుకి సూపరింటెండెంట్ ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ రెండు నెలల కాలంలో ఇష్టానుసారంగా డబ్బుల ఖర్చుకు ఆయన ఉత్సాహం చూపడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిజిటలైజేషన్ పేరుతో 30 కంప్యూటర్లను కొనుగోలు చేసేందుకు ఆయన అత్యుత్సాహం చూపడం కూడా అనుమానాలకు దారి తీస్తోంది. 5000 రూపాయలకు మించి ఏది కొనాలన్నా దానికి ప్రభుత్వ నిబంధనలు ప్రకారం కొటేషన్లు పిలవడం వంటి తతంగాలు ఉంటాయి. అవేమీ లేకుండా తాను సూచించిన దగ్గర నుంచే వాటిని కొనుగోలు చేయాలని ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావడం వెనుక కమీషన్ల ఆశేనని ఉద్యోగ వర్గాలు అభియోగాలు గుప్పిస్తున్నాయి. అగ్ర కులానికి చెందిన ఆయనకు తక్కువ కులస్థులు అంటే పడదని, ఇదీ కూడా తమపై వేధింపులకు ఒక కారణమేనని వారు ఆరోపిస్తున్నారు. తాను చెప్పిన వాటికే నిధులను ఖర్చు చేయాలంటూ సూపరింటెండెంట్ తీవ్ర ఒత్తిడులు తీసుకురావడం కూడా ఘర్షణ వాతావరణానికి కారణమౌతోంది. ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకూ, మెంటల్ ఆసుపత్రిలోని పరిస్థితులకు తేడా ఉంటుంది. మెంటల్ ఆసుపత్రికి వచ్చే మానసిక రోగుల పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందో తెలియదు. ముఖ్యంగా మహిళ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి మేడ మీద ఉన్న గ్రేడ్ 1, 2 ల నర్సింగ్ సిబ్బంది గదులను డిజిటల్ లైబ్రరీ పేరుతో కిందకు మార్చేందుకు సూపరింటెండెంట్ ప్రయత్నిండం ఆయావర్గాల్లో ఆగ్రహం కలిగించింది. వాస్తవానికి సదరు గది చాలా చిన్నది. ఒకవేళ డిజిటల్ లైబ్రరీ పెట్టాలంటే ఆసుపత్రిలో చాలా పెద్ద పెద్ద హాళ్లు ఖాలీగా అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని కాదని కేవలం నర్సింగ్ సిబ్బంది ఉంటున్న ఈ చిన్న గదిని ఖాలీ చేయించాలనుకోవడం వెనుక సదరు అధికారి దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇవేగాక ఎక్స్ రే, ల్యాకు చెందిన ఉద్యోగుల విషయంలో అధికారి తీసుకున్న నిర్ణయాలు విమర్శల పాలవుతున్నాయి. ముఖ్యంగా సిఎస్ ఆర్ఎమ్ ఓతో సహా 14 మంది సిబ్బందిని సరెండరు సదరు అధికారి చర్యలు ఉపక్రమించడం, ఈ నిర్ణయాన్ని డిఎంఈ కార్యాలయం తిరస్కరించడంతో పాటు, అధికారికి చీవాట్లు పెట్టినట్లు కూడా తెలిసింది. మిగిలిన ప్రభుత్వ శాఖలతో పోలిస్తే వైద్యారోగ్యశాఖ ప్రత్యేకమైనది. ఈ శాఖలో అన్ని విభాగాల ఉద్యోగులు సమష్టిగా ఒక అవగాహనతో పనిచేసినప్పుడే రోగులకు మంచి సేవలు అందే అవకాశం ఉంది. ఆశాఖలో పనిచేసే అందరి ఉద్యోగులను కలుపుకొని వెళ్తూ రోగులకు సంతృప్తి కరమైన సేవలు అందించినప్పుడే సూపరింటెండెంట్ కుర్చీకి న్యాయం చేసినట్లవుతుది. అంతేగానీ ” నేనే రాజు …. నేనే మంత్రి ” అన్నట్లుగా వ్యవహరిస్తే ఆసుపత్రి పరువు పోవడం ఖాయం. రాష్ట్రంలోనే మానసిక రోగులకు ఒక రిఫరల్ ఆసుపత్రిగా పేరుగాంచిన విశాఖపట్నం మెంటల్ ఆసుపత్రి ఉన్నతాధికారి ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకూ సబబు అనేది జిల్లా ఉన్నతాధికారులు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సమీక్ష చేసుకోవడం మంచిది.