వార్తలు

రోటరీ బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం

పత్రికా ప్రకటన
విశాఖపట్నం, తేది, 12 జనవరి, 2021. జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద 158 జయంతి) సందర్భంగా యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర శాఖ వారి ఆధ్వర్యంలో తే 12-01-2021దీన జగదాంబ జంక్షన్ వద్ద గల స్ధానిక రోటరీ బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరం లో స్ధానిక బి. వి.కె. కళాశాల విశ్రాంత సంస్కృత అధ్యాపకులు శ్రీ పిళ్ళా వెంకట రమణ మూర్తి గారు 98వ సారి రక్త దానం చేసి యువతకు స్ఫూర్తి గా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిత్య శారీరక వ్యాయామం, నియమబద్ధ మైన ఆహారం తీసుకోవడంలో జాగ్రత్త వహించడం ప్రధాన మని, రక్తదానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాల ను కాపాడే అవకాశం ఉంటుంది అని, యువత సేవాస్ఫూర్తి తో రక్త దానం చేయడానికి ముందుకు రావాలని, భావితరాలకు వారసత్వంగా నిలవాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్ర యూత్ హాస్టల్ అసోసియేషన్ అధ్యక్షుడు డా సి హెచ్ శ్రీనివాస్ ప్రసాద్ గారు తమ సంస్థ కార్యకలాపాలలో కేవలం ఎడ్వెంచర్ మరియు ట్రెక్కింగ్ కార్యక్రమాలు మాత్రమే కాకుండా జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా రక్త దానం చేయడానికి సంకల్పించామని, ఈ కార్యక్రమంలో శ్రీ పిళ్ళా రమణమూర్తి గారు 98 వ సారి రక్త దానం చేయడం మాత్రమే కాకుండా మా యూత్ హాస్టల్ అసోసియేషన్ సభ్యులకు స్ఫూర్తి ప్రదాత గా వ్యవహరించడం మిక్కిలి ఆనందదాయకం అని చెప్పారు. రోటరీ బ్లడ్ బ్యాంక్ అధ్యక్షుడు శ్రీ జి ఎస్ రాజు గారు మాట్లాడుతూ కోవిడ్ వలన రక్తనిల్వల లోటు భర్తీ చేయడానికి ఇటువంటి శిబిరాలు దోహదపడతాయి అని,రక్త దానం చేయడానికి ముందుకు వచ్చిన యూత్ హాస్టల్ అసోసియేషన్ సభ్యులకు, ముఖ్యంగా పిళ్ళా రమణమూర్తి గారి కి కృతజ్ఞతా పూర్వక అభినందనలు తెలిపారు.
పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం శాఖ అధ్యక్షుడు శ్రీ పి ఎల్ కె మూర్తి గారు మాట్లాడుతూ రక్త దానం యొక్క ఆవశ్యకత గురించి వివరించారు. ఈ సందర్భంగా యూత్ హాస్టల్ అసోసియేషన్ అధ్యక్షుడు డా సి హెచ్ శ్రీనివాస్ ప్రసాద్ గారు, సిటీ యూనిట్ గౌరవ కార్యదర్శి& అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారులు శ్రీ పి.కొండలరావుగారు, రోటరీ క్లబ్ విశాఖ పోర్టు సిటి మాజీ అధ్యక్షులు వడ్లమాని ఇందిర గారు, పి ఎల్ కె మూర్తి గారు, జి ఎస్ రాజు గారు పిళ్ళా రమణమూర్తిగారినివారి సతీమణి శ్రీమతి శ్రీ రేఖని ఘనంగా సత్కరించారు.
అనంతరం యూత్ హాస్టల్స్ అసోసియేషన్‌లోని 25 మంది సభ్యులు రక్తదానం చేశారు
ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు, యూత్ హాస్టల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Comment here