వార్తలు

సాంకేతికత ఉపయోగించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి

పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

Bhaarath voice, విశాఖపట్నం, డిసెంబర్ 31: ఆధునిక సాంకేతికతను జోడిస్తూ జిల్లాలో వ్యవసాయం అనుబంధ రంగాలను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతు భరోసా కేంద్రాలను మరింత చైతన్యవంతం చేసి రైతులకు సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అందించాలన్నారు. వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సభ్యుల సలహాల మేరకు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలన్నారు.
జడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో తృణ ధాన్యాల సాగుపై గిరిజనులకు సలహాలు అందించాలని, జోలాపుట్ జలాశయంలో అరుదైన రుచికరమైన చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఎం.పీ. డా.బి.వి. సత్యవతి మాట్లాడుతూ అనకాపల్లిలో బెల్లం తృణధాన్యాల, పనస పళ్ళు మొదలైన ఉత్పత్తులతో ఆహార తయారీ కేంద్రం మంజూరైనట్లు తెలిపారు.

జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సాధారణ వర్షపాతం 1009.6 మి.మీ. కాగా ఈ సంవత్సరం 1032.4 మి.మీ. 2.3మి.మీ. ఎక్కువ కురిసిందని తెలిపారు. జిల్లాలోని వ్యవసాయ పరిస్థితుల సభ్యుల, శాస్త్రవేత్తల సలహాలు క్రోడీకరించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. మండల, గ్రామస్థాయి వ్యవసాయ సహాయకుల పనితీరును మెరుగు పరచాలన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ సిహెచ్.రామారావు మాట్లాడుతూ జిల్లాలో వాతావరణ పరిస్థితులు, ఆధునిక వంగడాలు, ఎరువులు, క్రిమి సంహారకాలు, నేలను బట్టి పంట వేయడం పై రైతులకు అవగాహన కలపించాలన్నారు.
వ్యవసాయ శాఖ జె.డి. లీలావతి జిల్లాలోని వ్యవసాయ పరిస్థతిులను వివరిస్తూ ఖరీఫ్ లో 175435 హెక్టార్ల సాధారణ విస్తీర్ణంకి గాను 1,54,196 హెక్టార్లలో 88 శాతం పంటలు సాగు చేయడం జరిగిందని, రబీలో ఇప్పటివరకు 34,030హెక్టార్లు సాధారణ విస్తీర్ణానికి గాను ఇప్పటి వరకు 9367 హెక్టార్లలో పంటలు సాగు చేయడం జరిగిందని తెలిపారు. రైతు భరోసా, యూనిఫైడ్ డిజిటల్ ఫ్లాట్ఫామ్, ఈ-పంట నమోదు, విత్తనాల సరఫరా, పొలంబడి, ఎరువులు సరఫరా, వ్యవసాయ యాంత్రీకరణ, వైయస్ఆర్ రైతుభరోసా, సాగుదారు హక్కు ధ్రువపత్రాలు పంటరుణాలు, వైయస్సార్ వడ్డీ పథకం, పంట నష్టపరిహారం, జాతీయ ఆహార భద్రతా మిషనులను గూర్చి వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు ఎస్.రమణ, వి.అచ్ఛంనాయుడు, పల్లా రమణ, ఎం.సరస్వతి, ఎ.పండు, పి.వి.సుబ్బరాజువర్మ, మత్స్యశాఖ, పశుసంవర్ధకశాఖ, డి.యం.సివిల్ సప్లైస్, లీడ్ బ్యాంకు మేనేజరు, మార్క్ ఫెడ్ డి.యం. తదితర అధికారులు పాల్గొన్నారు.