వార్తలు

స్పందన అర్జీలు రీ ఓపెన్ కాకూడదు

అర్జీలను కాలపరిమితిలోగా పరిష్కరించాలి
– జిల్లా కలెక్టర్ డా.ఏ.మల్లికార్జున

విశాఖపట్నం, ఆగస్ట్ 8:-స్పందన కార్యక్రమంలో వచ్చే వినతులపై శాఖాధిపతులు తక్షణమే ప్రతి స్పందించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.మల్లికార్జున పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలియజేసి వాటిని పరిష్కరించు కునేందుకు చక్కని వేదిక స్పందన కార్యక్రమం రూపొందించబడిందని అన్నారు. సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో స్పందన దరఖాస్తుల పరిష్కారం మరియు పలు విషయాల పై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు స్పందనలో వచ్చిన దరఖాస్తులు వాటి పరిష్కారము , పెండెన్సీ పై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ డా.ఏ.మల్లికార్జున మాట్లాడుతూ స్పందన వినతుల పరిష్కారంలో అలక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా వివిధ సమస్యలపై ప్రజల నుండి స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశిత సమయంలో పరిష్కరించాలన్నారు. స్పందన అర్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ రీ ఓపెన్ కాకూడదని, కాలపరిమితిలోగా దరఖాస్తులన్నింటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.
రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని ఇంకా ప్రొబేషన్ పూర్తి కాని సచివాలయం ఉద్యోగులకు వెంటనే ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వము ఇచ్చిన కొత్త సవరణ ప్రకారంగా సచివాలయం ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా గుర్తించిన ప్రాధాన్యత పనులు పరిష్కారానికై ప్రభుత్వం ప్రతి సచివాలయానికి 20లక్షల రూపాయలు కేటాయించటం జరిగిందన్నారు. పని అంచనా ఎటువంటి రాజీలు లేకుండా చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు పేర్కొన్న సమస్యలను పరిష్కారం చేయటానికి సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలిస్తున్నారని, దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
ఏఎన్ఎం లు, మహిళా పోలీసులు , వెల్ఫేర్ అసిస్టెంట్ లు వారి పరిధిలో ఉన్న ప్రభుత్వ పాటశాలల్లో తరుచూ తనిఖీలు నిర్వహించి పిల్లల సంక్షేమం కొరకు కృషి చేయాలన్నారు.తదుపరి జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమంలో ప్రజలనుండి విజ్ఞప్తులు స్వీకరించారు. సోమవారం స్పందన కార్యక్రమం లో 180 విజ్ఞప్తులు అందాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కే.యస్.విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస మూర్తి, జిల్లా అధికారులు తదితరులు
పాల్గొన్నారు