వార్తలు

హెటిరో ఫార్మా సంస్థలో ఐటీ సోదాలు, రూ. 142 కోట్ల నగదు స్వాధీనం

భారత్ వాయిస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఫార్మా కంపెనీపై అక్టోబర్ 6న దాడులు నిర్వహించిన ఆదాయపన్ను శాఖ రూ. 142 కోట్ల నగదును స్వాధీనం చేసుకుందని, అకౌంట్లలో చూపని ఆదాయం రూ. 550 కోట్లకు పైగా ఉన్నట్లు గుర్తించిందని శనివారం మధ్యాహ్నం పీఐబీ ఒక ప్రకటన విడుదల చేసింది. హెటిరో ఫార్మా సంస్థ ఔషధాల తయారీలో ఉపయోగించే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ), మరికొన్ని ముడి పదార్థాలను తయారుచేస్తుంది. ఈ సంస్థ ఉత్పత్తుల్లో చాలావరకు అమెరికా, ఐరోపా, దుబాయి, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఆరు రాష్ట్రాల్లోని సంస్థకు చెందిన 50 కార్యాలయాల్లో బుధవారం ఈ దాడులు మొదలయ్యాయి. రహస్యంగా దాచిపెట్టిన అకౌంటు పుస్తకాలతోపాటు డబ్బు కూడా సోదాల్లో బయటకు వచ్చింది. కొన్ని డిజిటల్ మీడియా ఫైళ్లు, పెన్ డ్రైవ్‌లు, డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డొల్ల కంపెనీలు, ఉనికిలోలేని సంస్థల నుంచి సామగ్రి కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్నిసార్లు ధరలను కావాలనే ఎక్కువ చేసి చూపించినట్లు తేలింది. నగదు రూపంలో డబ్బులు చెల్లించి భూములు కూడా కొన్నట్లు వెలుగులోకి వచ్చింది. కంపెనీ ఖాతాలో వ్యక్తిగత ఖర్చులను కలిపి రాయడం, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ కంటే చాలా తక్కువకే భూములు కొనుగోలు చేయడం లాంటి అవకతవకలను కూడా అధికారులు గుర్తించారు. సోదాల్లో కొన్ని బ్యాంకు లాకర్లకు సంబంధించిన సమాచారం కూడా దొరికింది. ఈ సంస్థకు మొత్తంగా 16 బ్యాంకు లాకర్లు ఉన్నాయి. ఎలాంటి వివరాలులేని నగదే రూ.142.87 కోట్ల వరకు ఉంది. దీన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అకౌంటు పుస్తకాల్లో చూపని ఆదాయం రూ.550 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా లెక్కల్లో చూపని ఆదాయం ఎంత ఉంది? ఈ ఆదాయం ఎలా వచ్చింది? తదితర అంశాలపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.