వార్తలు

హైదరాబాద్ లో జడివాన..గంటల తరబడి ట్రాఫిక్ జామ్

భారత్ వాయిస్, హైదరాబాద్‌: నగరంలో జడివాన కురిసింది. వరుణుడి ప్రతాపానికి హైదరాబాద్‌ అతలాకుతలమైంది. రహదారులు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాలలో వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. వారు ఇళ్లకు చేరుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. శనివారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌, అసెంబ్లీ ముందు రహదారిపై భారీగా నీరు చేరింది. ఎంజే మార్కెట్‌, నాంపల్లి నుంచి అసెంబ్లీ, లక్డీకాపూల్‌ వరకు భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. . హైదర్‌గూడ, లిబర్టీ వైపు వెళ్లే మార్గంలో రాకపోకలకు ఆంటంకమేర్పడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మూసారాంబాగ్‌ వంతెనపై వరదనీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ నుంచి కింగ్‌కోఠి వైపు మార్గంలో రోడ్లు జలమయమయ్యాయి. అంబర్‌పేట, కాచిగూడలో నాలాలు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. దీంతో మలక్‌పేట మార్కెట్‌ నుంచి చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి వరకు వాహనాలు నిలిచిపోయాయి. బేగంపేట నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే వాహనాలు మయూరి మార్గ్‌ వద్ద భారీగా నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది.