వార్తలు

ఉన్నతాధికారికి ఘన సత్కారం…. ఉద్యోగుల నుంచి వసూళ్ల బాదుడు !

ప్రతీ  పిహెచ్ సి నుంచి రూ. 5000
విలవిల్లాడుతున్న ఉద్యోగులు
జిల్లా వైద్యారోగ్యశాఖలో గుప్పుమంటున్న వార్తలు

భారత్ వాయిస్, విశాఖపట్నం : జిల్లా వైద్యారోగ్యశాఖలో ఒక వార్త ప్రస్తుతం గుప్పుమంటోంది. ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కోవిడ్ వైరస్ కారణంగా తమ జీవితాలు అస్తవ్యస్తంగా తయారైన సమయంలో ఈ ‘వసూళ్ల బాదుడు’ ఏంట్రా అని పలువురు ఉద్యోగులు నెత్తీనోరు బాదుకుంటున్నట్లు తెలిసింది. డబ్బులు ఇవ్వకపోతే మున్ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుందనే బెదిరింపులు కూడా ‘కలెక్షన్ కింగ్’ల నుంచి వస్తున్నాయని కొంతమంది ఉద్యోగులు బావురుమంటున్నారు. ఈ కార్యక్రమం అడ్డు పెట్టుకొని లక్షల రూపాయలను వెనకేసుకోవడమే నిర్వాహకుల పరమావధి అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా సదరు ఉన్నతాధికారి ఇష్టాపూర్వకంగానే జరుగుతోందా.. లేక నిర్వాహకుల ఉద్దేశపూర్వకంగా జరుగుతోందానేది ఆ భగవంతుడికే తెలియాలి.

పూట గడవటానికి నాలుగు నోట్లు సంపాదించుకునేందుకు ఎలాంటి అవకాశాలు వస్తాయా.. అని కొంతమంది ఎదురు చూస్తుంటారు. ప్రతీ నెలా వేలాది రూపాయలు జీతంగా తీసుకునే ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కొంతమంది ఉద్యోగులు కూడా ఈ కోవలో ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఉన్నతాధికారుల ఉద్యోగ విరమణ కార్యక్రమాలను అడ్డు పెట్టుకొని, కిందస్థాయి సిబ్బంది నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు కార్యక్రమాలు చేపట్టడం ద్వారా జేబులు నింపుకుంటారు. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ నెలాఖరుతో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డిఎంఅండ్ హెచ్ఓ) డాక్టర్ పి.సూర్యనారాయణ ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన డీఎంఅండ్ హెచ్ ఓగా మంచి సేవలనే అందించారు. ముఖ్యంగా కోవిడ్ వ్యాధి విజృంభించి జిల్లాను అతలాకుతలం చేస్తున్న సమయంలో రాత్రీ పగలు శ్రమించడం ద్వారా మంచి సేవలను అందించారనే పేరు ప్రఖ్యాతులు గడించారు. తన సర్వీసు ద్వారా జిల్లా వైద్యారోగ్యశాఖలోని మిగతా ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారు. స్వతహాగా నిరాడంబరులు, మితభాషి అయిన సూర్యనారాయణ ఈ నెల చివరినాటికి ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఉన్నతాధికారులుగానీ, ఉద్యోగులు గానీ ఉద్యోగ విరమణ చేస్తున్నప్పుడు చిరు సన్మానాలు చేయడం ప్రతీ ప్రభుత్వ శాఖలో సర్వసాధారణం. ఈ క్రమంలో ఆయన మీద అభిమానంతో ఆయనకు ఘనసన్మానం చేసేందుకు కొంతమంది ఉద్యోగులు నడుం బిగించారు. వాస్తవానికి డిఎంఅండ్ హెచ్ఓ కార్యాలయం, దాని అనుబంధ కార్యాలయాల్లోనే సుమారు 70 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారి సహాయ సహకారాలతోనే చిరు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేయవచ్చు. అలా కాకుండా ‘ ఘన సన్మానం ‘ పేరుతో జిల్లాలో ఉన్న 120 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఒక్కో దాని నుంచి రూ. 5000 చొప్పున సుమారు ఆరు లక్షల రూపాయలను టార్గెట్ గా పెట్టుకొని వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే వసూళ్ల కార్యక్రమం 90 శాతం పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వసూళ్ల బాద్యతను డిఎంఅండ్ హెచ్ ఓ కార్యాలయంలోని ఒక సెక్షన్ ఉద్యోగుల్లో కొంతమంది తమ భుజ స్కందాలపై పెట్టుకొన్నట్లు తెలిసింది. ఈ వసూళ్ల కార్యక్రమంలో డిఎంఅండ్ హెచ్ ఓ భవనంలోనే వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగుల్లో కొంతమందీ కూడా తలోచేసి వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు ఇబ్బందుల్లో ఉన్నారు. కోవిడ్ కారణంగా చాలామంది ఉద్యోగుల జీవితాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో అనేకమంది కోవిడ్ బారినపడి లక్షలాది రూపాయలను వైద్య ఖర్చుల నిమిత్తం అప్పులు చేసి ఖర్చు చేశారు. దాంతోపాటు నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల,
పిల్లల స్కూలు, కాలేజీ ఫీజుల బాదుడు తదితర అంశాలన్నీ వీరిని ప్రస్తుతం ఇబ్బందుల పాల్టేస్తున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నతాధికారికి సన్మానం అంటూ జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగుల నుంచి వసూళ్ల తాఖీదులు వస్తుండటంతో వీరు బెదిరిపోతున్నారు.
జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో డిఎంఅండ్ హెచ్ఓ, మేల్, ఫిమేల్ రీజనల్ ట్రైనింగ్ సెంటర్, ఆర్డీ కార్యాలయం తదితర వాటికి వేర్వేరుగా సమావేశ మందిరాలు ఉన్నాయి. ఆయా వాటిలో సన్మాన కార్యక్రమాలు నిర్వహించవచ్చు. వీటన్నింటిని పక్కనబెట్టి లక్షలాది రూపాయలు అద్దె చెల్లించి ‘వుడా చిల్డ్రన్ థియేటర్ ‘లో డిఎంఅండ్ హెచ్ ఓ ఉద్యోగ విరమణ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం అంత అవసరమా అనే గుసగుసలు కూడా ఉద్యోగ వర్గాల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. వసూలు చేసిన డబ్బుల్లో కొంత వెనకేసుకునేందుకే కొంతమంది ఉద్యోగులు ఈ సత్కార కార్యక్రమానికి పూనుకున్నట్లు ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఉద్యోగులను మరింతగా బెదరగొట్టేందుకు జిల్లా కలెక్టరు,
జాయింట్ కలెక్టరులు కూడా ఈ సన్మాన కార్యక్రమానికి హాజరవుతున్నారనీ, వారికీ కూడా ఘన సత్కారం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నట్లు తెలిసింది. ఈ వసూళ్ల వ్యవహారాన్ని డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ పి.సూర్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన ఈ విధంగా స్పందించారు.
డిఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ పి.సూర్యనారాయణ వివరణ : ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేస్తున్న విషయం నిజమే. ఉద్యోగుల్లో కొంతమంది వచ్చి ఈ ఘన సత్కారం గురించి తెలిపినదీ వాస్తవమే. అయితే దీనిని తాను తిరస్కరించాను. అభిమానం ఉంటే ఒక శాలువా వేసి పంపించేయండి. అంతేగానీ నాకు ఈ సన్మానాలు ఇష్టం ఉండదు. ఒకవేళ నా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడితే సహించేది లేదు. ఒకవేళ ఎవ్వరైనా డబ్బులు వసూళ్లు చేస్తే, ఎవరి డబ్బులు వారికి ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటాను. దయచేసి జిల్లావైద్యారోగ్యశాఖలో పనిచేసే ఉద్యోగులు ఎవ్వరైనా ఇలాంటి వసూళ్ల కార్యక్రమంలో పాల్గొనవద్దని, ఎవరైనా వసూళ్లకు పాల్పడినా, ఇబ్బంది పెట్టినా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.