కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలు అనుమానం..
నార్కోటిక్స్ కేసు ఎన్ఐఏ చేతికి
గుజరాత్: ఇటీవల గుజరాత్‌లోని ముంద్రాపోర్టులో పట్టుబడిన రూ.21వేల కోట్ల విలువైన 3వేల కిలోల మత్తుమందుల కేసు దర్యాప్తులో మరో ముందడుగు పడింది. గుజరాత్లో పట్టుబడిన నార్కోటిక్స్ కేసు విచారణ ఎన్ఐఏకు బదిలీ అయింది. ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగించేందుకు కేంద్ర హోంశాఖ ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే డీఆర్ఐ నుంచి ఎన్ఐఏ ఈ కేసును స్వాధీనం చేసుకుంది. నార్కోటిక్స్ వ్యవహారంలో విదేశీ ఉగ్రవాద మూలాలు ఉన్నట్టు భావించిన కేంద్రం ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి మాదక ద్రవ్యాల దిగుమతిపై ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. గత నెల 15న ముంద్రా నౌకాశ్రయంలో పట్టుబడ్డ హెరాయిన్ వెనుక పాత్రధారి తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన మాచవరం సుధాకర్ అయితే.. సూత్రధారి మాత్రం మాదకద్రవ్యాల మాఫియాలో కింగ్‌పిన్.. దిల్లీ వాసేనని కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అఫ్గానిస్థాన్ నుంచి ఇరాన్ మీదుగా విజయవాడ చిరునామాతో ఉన్న ఆషీ ట్రేడింగ్ కంపెనీకి వస్తున్న ఈ మాదకద్రవ్యాన్ని దిల్లీకి చేర్చాలనేది వారి వ్యూహమని గుర్తించాయి. నిఘా, దర్యాప్తు సంస్థల దృష్టిలో పడకుండా ఉండేందుకు విజయవాడ సత్యనారాయణపురం చిరునామాతో కంపెనీని ప్రారంభింపజేసి దాన్ని చీకటి కార్యకలాపాలకు వినియోగించినట్లు నిర్ధారణకొచ్చాయి. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి గ్రామానికి చెందిన మాచవరం సుధాకర్ ఇందులో పాత్రధారి అయ్యాడని, తన భార్య పేరిట ఆషీ ట్రేడింగ్ కంపెనీని రిజిస్టర్ చేయించి, దాన్ని మాదకద్రవ్యాల సరఫరా ముఠాలకు అందించాడని తేల్చాయి. ఈ ఏడాది జూన్‌లో కూడా ఈ కంపెనీ పేరుతో టాల్కం పౌడర్ ముసుగులో దాదాపు 25 టన్నుల హెరాయిన్ అఫ్గానిస్థాన్ నుంచి దిగుమతై.. కాకినాడ పోర్టు ద్వారా దిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లు గుర్తించాయి.