Uncategorized

ఆరోగ్యవంతమైన సమాజంతోనే పటిష్టమైన దేశం

భారత్ వాయిస్ :

ఆరోగ్యవంతమైన సమాజంతోనే పటిష్టమైన దేశం ఆవిర్భవిస్తుందని ప్రముఖ న్యూట్రీషియన్, ఇగ్నో అకాడమిక్ కౌన్సిలర్ డాక్టర్ ఆర్ రేఖ పేర్కొన్నారు. విశాఖపట్నం ఆకాశవాణి వార్తా విభాగం, విజయవాడ రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పోషణ  మా అన్న అంశంపైన ఈ రోజు జాతీయ వెబ్ నార్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన  డాక్టర్ రేఖ మాట్లాడుతూ, పౌష్టిక ఆహారం మీద ప్రజలకు అవగాహన పెరగాలి అని అన్నారు. 2018 ప్రధాని నరేంద్ర మోడీ పోషణ అభియాన్  పేరిట కార్యక్రమాన్ని దేశంలో ప్రారంభించారని గుర్తు చేశారు. మహిళలు, పిల్లలు బాగుంటే దేశం బాగుంటుంది అన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని  అన్నారు. పౌష్టిక ఆహారం అంటే ఖరీదైన ఆహారం కాదని ఆమె అన్నారు. తక్కువ ధరలకు లభించే కాయగూరలు, ఆకు కూరలతో కూడా చక్కని పౌష్టిక ఆహారం లభిస్తుంది అన్నారు. ఈ దేశంలో చాలా మందికి ఏ రకమైన ఆహారం తీసుకోవాలన్న దాని మీద చైతన్యం లేకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. కొత్త రకం వ్యాధులు కూడా పౌష్టిక ఆహారం లోపం వల్ల వస్తున్నాయని డాక్టర్ రేఖ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితి మారాలంటే మంచి ఆహారం మీద ప్రతీ వారికి సరైన అవగాహన ఉండాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి. చిన్మయీదేవి మాట్లాడుతూ, మహిళా శిశు సంక్షేమం కోసం  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయని అన్నారు. సెప్టెంబర్ నెల అంతా పోషణ మా గా కేంద్రం నిర్ణయించిందని, ఈ సందర్భంగా అనేక రకాలుగా అవగాహన  కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిరక్షరాస్యులతో పాటు ఉన్నత వర్గాల వారిలో కూడా చాలా మందికి బలవర్ధకమైన ఆహారం గురించి సరైన అవగాహన లేదని చిన్మయీదేవి అన్నారు. ఈ నేపధ్యంలో  పోషణ్  మా ద్వారా ఆహ్లాదక‌రమైన, సమర్ధవంతమైన సమాజానికి కృషి చేయాల్సిన అవసరం అందరి మీద ఉందని అన్నారు.

మరో వక్తగా పాల్గొన్న మైల్ స్టోన్ సొసైటీ నిర్వాహకురాలు, న్యాయవాది రెహామున్నీసా మాట్లాడుతూ, మహిళల ఆరోగ్యం అంటే తరతరాల ఆరోగ్యం అని అంతా గుర్తించాలని అన్నారు. మహిళలు, పిల్లల ఆరోగ్యం బాగుంటే ఉత్తమ సమాజం ఆవిష్కరించబడుతుందని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చక్కని కార్యక్రమంగా పోషణ అభియాన్ ని తీసుకువచ్చిందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లాకు చెందిన ఎఫ్ పీ ఓ తారకప్రసాద్ అధ్యక్ష్తత వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రం పోషణ్ మా ద్వారా అంతా చైతన్యవంతులు కావాలని కోరారు. విశాఖ ఆకాశవాణి వార్తా విభాగం అధిపతి వి శ్రీనివాసమహేష్ తదితరులు ఈ జాతీయ  వెబ్ నార్ లో పాల్గొన్నారు.