వెబ్ పోర్టల్లో 143 కళాశాలలకు అనుమతి
ఈ నెల 11 నుంచి ఇంజినీరింగ్ సీట్లకు వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో కళాశాలల జాబితాను ఎంసెట్ వెబ్ పోర్టల్ ఉన్నత విద్యా మండలి అధికారులు అప్లోడ్ చేస్తున్నారు. బుధవారం రాత్రి వరకు 143 కళాశాలల వివరాలు పొందుపరిచారు. ఇందులో జేఎన్టీయూ, ఓయూ పరిధిలోని 119 ప్రైవేటు, 24 ప్రభుత్వ కళాశాలలున్నాయి. జేఎన్టీయూ పరిధిలోని మరో 23 కళాశాలలకు గుర్తింపు ప్రక్రియను గురువారం మధ్యాహ్నానికి పూర్తి చేసి ఉన్నత విద్యా మండలికి పంపించనున్నారు.
అధ్యాపకులు లేని కళాశాలలకు జేఎన్టీయూ-హెచ్ గట్టి షాక్ ఇచ్చింది. ఇంజినీరింగ్ బ్రాంచీల వారీగా సీట్లను తగ్గించి కళాశాలలకు అఫిలియేషన్ జారీ చేసింది. జేఎన్టీయూ పరిధిలో 148 కళాశాలలు ఉన్నాయి. కరోనా మహమ్మారి సమయంలో అధ్యాపకులను కళాశాలలు విధుల్లోంచి తొలగించాయి. కొన్ని కోర్సులకు కనీస సంఖ్యలో అధ్యాపకులు లేరు. తాజాగా ఆయా కళాశాలపై జేఎన్టీయూ కఠిన చర్యలు తీసుకుంది. అధ్యాపకులు లేని కోర్సులకు గుర్తింపు నిలిపివేసింది. ఏదైనా కళాశాలలో నిర్దేశిత సంఖ్య కంటే 50 శాతం తక్కువగా అధ్యాపకులు ఉన్న కోర్సు (బ్రాంచీ)లలోని సీట్లకు అనుమతి ఇవ్వలేదు. వర్సిటీ పరిధిలోని 16 కళాశాలల్లో వివిధ బ్రాంచీల పరంగా 3 వేల సీట్లకు అనుమతి నిలిపివేసినట్లు తెలిసింది. ఒకరు లేదా ఇద్దరు తక్కువగా ఉంటే వీలైనంత త్వరగా నియమించుకోవాలని ఆదేశించింది. అలాగే ప్రిన్సిపాళ్లు లేని కళాశాలలకు షరతులతో కూడిన అఫిలియేషన్ మంజూరు చేసింది. రెండు నెలల్లోగా ప్రిన్సిపాళ్లను నియమించాలని సూచించింది.