Uncategorized

ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులదే బాధ్యత :జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్

..(భారత్ వాయిస్ , విశాఖపట్నం ) ఫిబ్రవరి 24: : జీవీఎంసీ ఎన్నికలలో రిటర్నింగ్ అధికారులు పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పేర్కొన్నారు. బుధవారం వి.ఎం.ఆర్.డి.ఏ.చిల్డ్రన్స్ ఎరీనా లో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని, సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోవాలని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో మూడు ఘట్టాలు ఉంటాయని, పోలింగ్ ముందు, పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం చేయవలసిన పనులను ముందుగా సమీక్షించుకొని తగిన ముందస్తు చర్యలను చేపట్టాలన్నారు. పోలింగ్ కు ముందుగా చేసే పనులలో బ్యాలెట్ పేపర్ సిద్ధం చేయడం ప్రముఖమైనదని తెలిపారు. నామ పత్రాల విరమణ కు ముందుగానే బ్యాలెట్ డ్రాఫ్ట్ ప్రతిని సిద్ధం చేసుకుంటే బాగుంటుందన్నారు. ఎన్నికల కమిషన్ నియమాలను అనుసరించి ముందుగా జాతీయ పార్టీలు తరువాత ప్రాంతీయ పార్టీలు చివరగా స్వతంత్రులను తెలుగు అక్షరమాల ప్రకారం వరుసక్రమాన్ని నిర్ణయించాలన్నారు. బ్యాలెట్ పేపర్ తయారీలో ఏమాత్రం అలసత్వం ఉండకూడదన్నారు. గుర్తుల కేటాయింపు లో ప్రతి అభ్యర్థికి 3 గుర్తులను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుందని, నియమాలను తు.చ. తప్పకుండా గుర్తులు కేటాయించాలన్నారు సమయం తక్కువగా ఉన్నందున బ్యాలెట్ పేపర్ లను 24 గంటలలోగా సర్వీస్ ఓటర్లకు పంపించవలసి వుంటుందన్నారు. బ్యాలెట్ పత్రాలు తయారు అనంతరం జోనల్ కమిషనర్ లు భద్రపరచాలన్నారు. ఎన్నికల నియమావళి అమలు రిటర్నింగ్ అధికారులు చూడాలన్నారు. పోలింగ్ సిబ్బందికి రిటర్నింగ్ అధికారి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులను కల్పించాలని, వేగంగా ఓట్లను వేసేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాలని, పోలింగ్ కేంద్రాలలో వీడియోగ్రఫీ, సూక్ష్మ పరిశీలకులు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలన్నారు, పోలింగ్ ఏజెంట్ లకు నియామక పత్రాలు జారీ చేయాలన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లకు సీల్ వేయడం, వివరాలను సంబంధిత కవర్లలో సీల్ చేయవలసి ఉంటుందన్నారు. జివిఎంసి కమిషనర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల నియమావళి హ్యాండ్ బుక్ ను సమగ్రంగా చదివి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సిబ్బంది సమన్వయంతో పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆదేశించారు.