Uncategorized

కోవిడ్ కట్టడికి నోడల్ అధికారులందరూ సమన్వయం తో కృషి : జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున

విశాఖపట్నం, జనవరి 22: జిల్లాలో కోవిడ్ కట్టడికి నోడల్ అధికారులందరూ సమన్వయం తో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టర్ కోవిడ్ నోడల్ అధికారులతో కలెక్టరేట్ సమావేశమందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి వైద్య సేవలు, కిట్లు సక్రమంగా అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోవిడ్ టెస్టింగ్, కోవిడ్ కేర్ సెంటర్ల నిర్వహణ, ఆసుపత్రులలో హెల్ప్ డెస్క్ నిర్వహణ, ఆక్సిజన్ మేనేజ్ మెంట్, రిపోర్ట్సు కమిటి, కోవిడ్ ఆసుపత్రులు, హోం క్వారంటైన్ మరియు ఐసోలేషన్, మందులు ఇతర అత్యవసర ఎక్విప్ మెంట్ , గ్లౌజులు, పి పి ఇ కిట్లు, అంబులెన్స్, 104 కాల్ సెంటర్, తదితర కమిటీల నోడల్ అధికారులతో ఆయా అంశాలపై వివరంగా సమీక్షించారు. కోవిడ్ కేర్ సెంటర్లలో పేషెంట్లు వారికి అందుతున్న సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ రోగులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలన్నారు. కోవిడ్ పరీక్షల నిర్వహణ రిపోర్టులు అందించడంలో ఆలస్యం చేయరాదన్నారు. జిల్లాలోని పి.హెచ్.సిలు, సి.హెచ్.సిలను స్వయంగా పరిశీలించి నివేదిక యివ్వాలని డి.సి.హెచ్.ఎస్ లక్ష్మణరావును ఆదేశించారు. ఆసుపత్రులలో వైద్యాధికారికి కోవిడ్ +ve (పాజిటివ్) వస్తే తదుపరి ఏర్పాట్లు పై అవసరమైన ఆదేశాలను జారీ చేయాలన్నారు. ఆసుపత్రులలో ఆక్సిజన్ సరఫరాకు ఎటువరి ఆటంకము కలుగకుండా చూడాలని జనరల్ మేనేజర్ (పరిశ్రమలు) మరియు అసిస్టెంట్ డైరక్టర్స్ (డ్రగ్స్) ను ఆదేశించారు. ప్రతి ఆసుపత్రిలో టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉంచాలన్నారు. ప్రవేట్ ల్యాబ్స్ లో టెస్టింగ్ రేట్లు డిస్ ప్లే గావించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖాధికారును ఆదేశించారు.
ఈ సమావేశంలో జి.వి.ఎం .సి కమిషనరు లక్ష్మిషా, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.