Uncategorizedవార్తలు

చురుగ్గా విశాఖ-రాయపూర్ ఆర్థిక కారిడార్ పనులు

రాజ్యసభలో శ్రీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, మార్చి 15: భారత్‌మాల పరియోజన మొదటి దశ కింద ఆమోదించిన విశాఖపట్నం-రాయపూర్‌ ఆర్థిక కారిడార్‌ పనులు చురుగ్గా సాగుతున్నట్లు కేంద్ర జాతీయ రహదారుల మంత్రి శ్రీ నితిన్‌ జైరామ్‌ గడ్కరీ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ ఆర్థిక కారిడార్‌ రాయపూర్‌ సమీపంలోని అభన్‌పూర్‌ నుంచి విశాఖపట్నం సమీపంలోని సబ్బవరం వరకు నిర్మించనున్నట్లు తెలిపారు. 464 కిలోమీటర్ల మేర విస్తరించిన ఆర్థిక కారిడార్‌ను గ్రీనిఫీల్డ్‌ అలైన్‌మెంట్‌గా తీర్చిదిద్దనున్నారు.
చత్తీస్‌ఘడ్‌లో 124 కిలోమీటర్లు, ఒడిషాలో 240 కి.మీ, ఆంధ్రప్రదేశ్‌లో 100 కి.మీ మేర ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. దీనిని జాతీయ రహదారి 130 సీడీగా ప్రకటించడం జరిగింది. ఆర్థిక కారిడార్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి డీపీఆర్‌ పూర్తయింది. భూసేకరణ, పర్యావరణ అనుమతుల క్లియరెన్స్‌ పొందే పనులు వివిధ దశల్లో ఉన్నాయి. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణంలో భాగంగా చత్తీస్‌ఘడ్‌లో 42 కి.మీ, ఒడిషాలో 214 కి.మీ, ఆంధ్రప్రదేశ్‌లో 100 కి.మీ రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిచే ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి విశాఖ-రాయపూర్‌ ఆర్థిక కారిడార్‌కు సంబంధించిన పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
బొగ్గుపై 35 నుంచి 78 శాతం పన్నులు
న్యూఢిల్లీ, మార్చి 15: వివిధ గ్రేడ్‌లకు సంబంధించిన బొగ్గుపై విధిస్తున్న సుంకాలు 35 నుంచి 78 శాతం వరకు ఉన్నట్లు బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ ప్రల్హాద్ జోషి తెలిపారు. రాజ్యసభలో శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ బొగ్గు కనీస ధరపై రాయల్టీ కింద 14 శాతం, డీఎంఫ్‌ కింద 30 శాతం, నేషనల్‌ మైనింగ్‌ ఎక్స్‌ప్లోరేషన్ టాక్స్‌ కింద 2 శాతం, జీఎస్టీ కింద 5 శాతం, జీఎస్టీ కాంపెన్సేషన్‌ సెస్‌ కింద రవాణా అయ్యే ప్రతి టన్ను బొగ్గుపై 400 రూపాయల చొప్పున సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బొగ్గు తవ్వకాలు, రవాణాపై జీఎస్టీ కౌన్సిల్‌ సిఫార్సు మేరకు జీఎస్టీ విధిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే రవాణా అయ్యే ప్రతి టన్ను బొగ్గుపై 400 రూపాయల ఫిక్స్‌డ్‌ సుంకం విధించడానికి బదులుగా దేశంలో ఉత్పత్తి అయ్యే బొగ్గుపై విలువ ఆధారిత పన్ను విధించేలా జీఎస్టీని హేతుబద్దం చేయాలని కోరుతూ తమ మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి తెలియచేశారు