Uncategorizedవార్తలు

జగన్ వేవ్

మున్సిపోల్స్ లో అద్భుత విజయం
మున్సిపల్ కార్పొరేషన్లన్నీ వశం
తెలుగుదేశంకు తాటిపర్తి, మైదుకూరు మున్సిపాల్టీల్లో కంటితుడుపు

(భారత్ వాయిస్, విశాఖపట్నం )

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 20 సంవత్సరాల పాలన ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో గట్టిగానే చూపించింది. రాష్ట్రంలోని మొత్తం మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో 99 శాతం విజయాలను నమోదు చేసుకుంది. తాటిపర్తి, మైదుకూరు మున్సిపాల్టీలను తెలుగుదేశం పార్టీ గెల్చుకోగా, మిగిలిన వన్నీ వైకాపా వశమైపోయాయి. ఈ విజయాల వెనుక వైఎస్ జగన్ జనరంజక పాలనే అన్నది కాదనలేని నిజం. ముఖ్యంగా సచివాలయాల ఏర్పాటు, వాలంటీర్ల నియామకం వెరసి మంచి ఫలితాలను ఇచ్చాయి. గతంలో ప్రభుత్వాలు అందించే సంక్షేమ ఫలాలు రాబందులు లాంటి నాయకులు చేజిక్కించుకొని, తమకు నచ్చిన వారికి ఎంగిలి మెతుకుల్లా వేసేవారు. ఈ విషయాన్ని స్పష్టంగా కని పెట్టేసిన జగన్ వాటికి విరుగుడును కని పెట్టేశారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ సంక్షేమ ఫలాలను అందించగలిగారు. ముఖ్యంగా పెన్షన్ల విషయంలో ప్రజల కష్టాలను తీర్చేశారు. గతంలో పెన్షన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అలాంటిది ముఖ్యమంత్రి జగన్ వాలంటీరు వ్యవస్థ ద్వారా ప్రతీ నెల ఒకటో తారీఖునే లబ్దిదారులకు అందించారు. అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఆయా అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించడం అక్రమార్కులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే ప్రతిపక్షాలకు కొమ్ము కాయడం ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా విజయాన్ని జీర్ణించుకోలేని అనేకమంది సోషల్ మీడియా ద్వారా తమ అక్కసును తీర్చుకుంటూనే ఉన్నారు. ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను ఎప్పుడూ పట్టించుకోని సిఎం జగన్ ఒక విషయంలో మాత్రం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఫలితమే మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయమని చెప్పవచ్చు. మేయర్ స్థానాలను పూర్తిగానూ, చైర్మన్ గిరిలను 99 శాతం గెల్చుకున్న వైకాపా, రాష్ట్రంలోని చాలా కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాలను కోల్పోవాల్సివచ్చింది. దీనికి కారణం ఏంటనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంది. జీర్ణించుకోలేని విషయం ఏమిటంటే స్థానిక ప్రజల పట్ల వాలంటీర్ల నిర్లక్ష్య ధోరణి ఒక కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాలంటీర్లు బాధ్యతాయుతంగా ప్రజలతో వ్యవహరించగలిగితే జీవీఎంసీ ఎన్నికల్లో మరో 15 కార్పొరేటర్ల స్థానాలను వైకాపా గెలుచుకొని ఉండేదనే అభిప్రాయం ప్రజల్లో నెలకొని ఉంది. సిఎం జగన్ దీనిపై దృష్టి సారిస్తే భవిష్యత్తులో పార్టీ విజయాలకు ఎలాంటి డోకా ఉండదని వారి భావం.