Uncategorized

దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినికిడి యంత్రాలు పంపిణీ…

ప్రధాని నరేంద్రమోడీ జన్మదినోత్సవం సందర్భంగా దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినికిడి సమస్య బాధితులకు యంత్రాలు ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ పి. వి. ఎన్ మాధవ్ అన్నారు. నగరం లో దొండపర్తి పరిధిలో ఉన్న సుబ్బలక్ష్మి కల్యాణమండపంలో దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోడీ పుట్టినరోజు సందర్భంగా ఉచిత వినికిడి మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అతిధులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిధిగా హాజరైన మాధవ్ మాట్లాడుతూ దీన్ దయాళ్ ఆశయాలతో స్థాపించిన ఫౌండేషన్ చైర్మన్ రేగుల రామాంజనేయులు చేస్తున్న సేవాకార్యక్రమాలను కొనియాడారు. వినికిడి సమస్య నిర్మూలనకు నడుం బిగించి ప్రతి ఏటా వేలాది మంది కి దీన్ దయాళ్ సంస్థ ద్వారా ఉచిత వినికిడి యంత్రాలు పంపిణీ చేయడం సామాన్య విషయం కాదు అన్నారు.

సీనియర్ నాయకుడు రామకోటయ్య మాట్లాడుతూ దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ సేవలను స్వచ్చంద సంస్థలు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఇది గొప్ప బృహత్తరమైన కార్యక్రమం అన్నారు. దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ చైర్మన్ రేగుల రామాంజనేయులు మాట్లాడుతూ భారతదేశంలో వినికిడి సమస్య ఎక్కువగా ఉందని గుర్తించి ముందుగా ఆంధ్రప్రదేశ్ ను వినికిడి సమస్యలేని రాష్ట్రంగా చేయాలని సంకల్పించి ఉచిత వినికిడి యంత్రాలను పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. గత నాలుగు ఏళ్ళుగా పదివేల మందికి పైగా వినికిడి యంత్రాలను ఉచితంగా అందచేశాం అన్నారు. ఎక్కువగా పిల్లలు వినికిడి సమస్యతో చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. 2022 సెప్టెంబర్ 17 నాటికి 1 లక్ష మంది కి అత్యాధునిక వినికిడి యంత్రాలు ఉచితంగా పంపిణీ చేయడం తమ లక్ష్యం అన్నారు. 2024 నాటి కి తెలుగు రాష్ట్రాలను వినికిడి సమస్యలేని రాష్ట్రాలుగా తీర్చిదిద్దడమే ధ్యేయం గా ముందుకు వెలతాం అన్నారు. ప్రజా గాయకుడు దేవిశ్రీ ఆలపించిన దేశభక్తి గీతాలు అహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కోవిడ్ వాక్సినేషన్ ను పలువురు వినియోగించుకున్నారు. దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ ఇంచార్జి దారపు ప్రసాదరెడ్డి సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు రవీంద్రా రెడ్డి, రాష్ట్ర అధికారప్రతినిధి సుహాసిని ఆనంద్, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్, రాష్ట్ర సోషల్ మీడియా ప్రముఖుడు కేశవకాంత్, అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తిరుపతిరాజు, డిస్ట్రిక్ట్ గవర్నర్ రాజేశ్వరరావు, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ప్రతినిధి దారపు ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొని ప్రధాని నరేంద్రమోదీ కు జన్మదినశుభాకాంక్షలు తెలిపి, రాజకీయ పార్టీలు కు అతీతంగా దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ చేస్తున్న సేవలు కొనియాడారు.