Uncategorized

నిమ్మగడ్డపై చంద్రబాబు ఫైర్‌

(భారత్ వాయిస్ , అమరావతి)

మున్సిపోల్స్‌లో ఆటలు సాగవు
స్వరూపానంద దొంగస్వామి అంటూ చంద్రబాబు విమర్శ..!

ఏపీలో నాలుగు దశల్లో సాగిన పంచాయతీ ఎన్నికల్లో భారీ ఎత్తున అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వైసీపీ సర్కారు తామే గెలిచామని చెప్పుకోవడం సిగ్గు చేటని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇంత జరుగుతున్నా ఎన్నికలసంఘం కానీ, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కానీ వాటిని అఢ్డుకోలేకపోయారని ఆరోపించారు. వైసీపీ అక్రమాల ధాటికి ఎన్నికల కమిషన్‌ నిర్వీర్వ్యం అయిపోయిందని చంద్రబాబు విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వీరి బండారం బయటపడుతుందన్నారు. వైసీపీ దాడుల్ని అడ్డుకుని భారీ ఎత్తున్న పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.
పంచాయతీ ఫలితాలపై చంద్రబాబు ఫైర్‌…!
రాష్ట్రంలో నాలుగు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ తీవ్ర అక్రమాలకు పాల్పడిందని, పోలీసులను వాడుకుని విపక్షాలను భయభ్రాంతులకు గురిచేసిందని, చివరికి ఎన్నికల్లో గెలవలేక పలుచోట్ల ఫలితాలను తారుమారు చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. సక్రమంగా ఎన్నికలు జరిగుంటే మరో పదిశాతం ఫలితం వచ్చేదని చంద్రబాబు తెలిపారు. అదే జరిగితే వైసీపీ ఇప్పుడే పతనం అయ్యేదన్నారు. దాన్ని కాపాడుకోవడానికి వైసీపీ ప్రయత్నించిందని, ప్రజల తిరుగుబాటు వల్ల ప్రజావిజయం సాధించామని చంద్రబాబు తెలిపారు. తాజాగా పంచాయతీ పోరులో మంత్రుల స్వస్ధలాల్లో వైసీపీ ఓడిపోయిందని చంద్రబాబు గుర్తుచేశారు ఆలూరులో జయరాం, నడవపల్లిలో విశ్వరూప్‌, రాయుడుపాలెం దెందులూరు, పెదకాకాని ఓ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎంపీ సురేష్‌ ఏమయ్యారని ప్రశ్నించారు. ప్రజలు కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టగతులు ఉండవు. పోలీసులతో అరాచకాలు చేద్దామంటే రేపు మీరూ ఇక్కడే తిరుగుతారు అప్పుడేం చేస్తారని ప్రశ్నించారు.

వైసీపీ పతనం ఆరంభమైందన్న చంద్రబాబు..!
పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు చూపించిన చైతన్యంతో వైసీపీ పతనం ఆరంభమైందని చంద్రబాబు తెలిపారు. ఇది ఆరంభమేనని, దీన్ని ఆపడం ఆ పార్టీ వల్ల కూడా సాధ్యం కాదన్నారు. మీ పతనాన్ని మీరు తలకిందులుగా తపస్సు చేసినా ఆపలేరని వైసీపీని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇంత దుర్మార్గ ప్రభుత్వం, పక్షపాత ప్రభుత్వం కొనసాగడానికి అస్సలు వీల్లేదన్నారు. అదే సమయంలో అక్రమాలను తట్టుకుని ఓటేసిన ఓటర్లకు అభినందనలు తెలిపారు. నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లో ఎప్పుడూ చేయనంత సాహసం చేశారని కొనియాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడారని, ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రత్యర్ధులు ఎంత ఒత్తిడి తెచ్చినా వీరోచితంగా నిలబడ్డందుకు వారికి చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. మీరు చూపించిన చొరవ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

అక్రమాలను అడ్డుకోలేని నిమ్మగడ్డ ఎందుకు ?
పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరిగాయా అని ఎస్ఈసీని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరిపేందుకు అధికారాలు వాడాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, తాము కూడా ఎస్‌ఈసీకి 31 లేఖలు రాశానని, 180 ఫిర్యాదులు చేశామని తెలిపారు. అయినా మీరేం చేశారని ఎస్ఈసీ నిమ్మగడ్డను చంద్రబాబు ప్రశ్నించారు. రోడ్లపై ప్రజాస్వామ్యం కాపాడేందుకు ఓటర్లు ప్రయత్నిస్తే కమిషన్‌ మాత్రం నిర్వీర్వ్యమైందన్నారు. అధికార యంత్రాంగం నిస్సహాయంగా మారిపోయి అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోలేకపోయిందని చంద్రబాబు విమర్శించారు. శేషన్ ఢిల్లీలో ఉంటే గల్లీలో కూడా అంతా భయపడ్డారని,. మీకు అధికారం లేదా , కేంద్ర ఎన్నికల సంఘం అధికారాలే మీకున్నాయని, కానీ మీరు ఎందుకు వాటిని వాడలేకపోయారని నిమ్మగడ్డను చంద్రబాబు ప్రశ్నించారు.

మేం వచ్చాక పెద్దిరెడ్డిని బ్లాక్‌లిస్ట్‌లో పెడతాం…!
95 శాతం ఓట్లు పడితేనే మిమ్మల్ని వదిలిపెడతా లేకపోతే రాజీనామాలు చేయమని జగన్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారని, పోలీసులు, అధికారులు, వాలంటీర్లు అండగా ఉన్నారు, అక్రమాలు చేసుకోండని చెప్పేశారు. ఏదైనా చేసి గెలవాలని వారికి టార్గెట్లు పెట్టారు. దీంతో వారు చెలరేగి పోయారని చంద్రబాబు ఆరోపించారు. ఎస్ఈసీకి సహకరించని అధికారులను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని మంత్రి పెద్దిరెడ్డి బెదిరించారని, నిన్ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టలేమా, జమిలి ఎన్నికల తర్వాత మిమ్మల్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టలేమా ? అని చంద్రబాబు ప్రశ్నించారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో మీ ఆటలు చెల్లవిక..!
మున్సిపల్‌ ఎన్నికల్లోనూ గెలుస్తామని వైసీపీ నేతలు చెప్తున్నారని, కానీ అక్కడ ఓట్లు తారుమారు చేసే అవకాశం లేదని, రాత్రిపూట కౌంటింగ్‌లు లేవన్నారు. పట్టణ ప్రాంతాల్లో జనం చైతన్యవంతులు. ఇసుక వల్ల ఎంత నష్టపోయారన్నది వారికి తెలుసన్నారు. ధరలు పెరిగాయి. వ్యాపారాలు నాశనమయ్యాయి. ఉద్యోగులకు న్యాయం జరగలేదు. ఈ విషయాలన్నీ ప్రచారంలో జనంలోకి తీసుకెళ్తామన్నారు.ఓ దొంగకు అధికారమిచ్చారు. అది ప్రజల తప్పా, రాజ్యాంగం తప్పా, వ్యవస్ధ తప్పా అని ఒకరు అడిగితే నా దగ్గర సమాధానం లేదు. దొంగకే తాళాలిస్తే రాష్ట్రంలో అదే జరుగుతుంది. రాజారెడ్డి రాజ్యాంగం, మా పార్టీ అధికారం ముఖ్యం కాదు. రాష్ట్రం సర్వనాశనమవుతోంది. అందుకే పోరాడుతున్నాం. ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.

ఊడిగం కోసం దొంగస్వామిని అడ్డుపెట్టుకున్న జగన్‌..!
ప్రభుత్వంలో అధికారులు, సస్పెండ్‌ చేసిన అధికారులు కూడా కానుకలు ఇచ్చేందుకు విశాఖలో స్వామీజీ దగ్గరికి వెళ్తున్నారని చంద్రబాబు అన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా స్వరూపానంద దగ్గరికి వెళ్లి కానుకలు ఇచ్చుకుంటున్నారు. సీఎంయే దొంగస్వామిని అడ్డుపెట్టుకుని ఆయనకు ఊడిగం చేస్తుంటే అధికారులు కూడా అదే పని చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రామతీర్ధంలో రాముడి తల తీస్తే మాట్లాడని స్వామి… హిందుత్వాన్ని ఎలా కాపాడతారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. స్వచ్ఛందంగా ఉంటే స్వామిని గౌరవిస్తామని, దేవుడి పేరుతో అష్టభోగాలు అనుభవించే వారు స్వాములు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు