Uncategorized

రాష్ట్రంలో కాపుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత

సామాజిక భవనాల నిర్మాణానికి చేయూత

ఉద్యమ సమయంలో కేసుల ఎత్తివేత

తుని రైల్వే దహన కేసుల ఎత్తివేతకు ప్రయత్నం కాపుల ఆత్మీయ కలయిక సభలో విజయసాయిరెడ్డి

(భారత్ వాయిస్ , విశాఖపట్నం): – రాష్ట్రంలో కాపుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ మాధవధారలోని బొత్స స్క్వేర్ లో నిర్వహించిన కాపుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో కాపు సామాజిక భవనాల నిర్మాణానికి చేయూత అందిస్తామన్నారు. విశాఖలో కాపుల భవనం కోసం నాలుగు ఎకరాల స్థలం కేటాయించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. అన్ని సామాజిక వర్గాల భవనాలు ఒకే చోట ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తూర్పు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా.. 56 కులాలను దానిలో మిళితం చేసి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. మరో వైపు కాపు కార్పొరేషన్‌కు చైర్మన్ గా జక్కంపూడి రాజాను నియమించడం జరిగందని, దాని ద్వారా కూడా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి, తన క్యాబినేట్ లో కాపులకు పెద్దపీట వేయడమే కాకుండా తాజాగా జరుగుతున్న జీవీఎంసీ ఎన్నికల్లో 23 మందికి టికెట్లు ఇవ్వడం జరిగందన్నారు. ఉద్యమాల సమయంలో చంద్రబాబు పెట్టిన కేసులను తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని తీసివేయించిన విషయాన్ని గుర్తు చేశారు. తుని రైలు దగ్గం కేసులో కేసుల పెండింగ్ లో ఉన్నందున త్వరలోనే కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తో చర్చించి.. వాటిని కూడా రద్దు చేయించే విధంగా ప్రయత్నిస్తామన్నారు. దశలవారీగా కాపుల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూత అందిస్తోందన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం కాపులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. ఉద్యమనేత ముద్రగడతో పాటు అనేక మందిపై ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు పెద్ద పీట వేయడం వల్లే తాను, జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు కీలకమైన మంత్రి పదవుల్లో కొనసాగుతున్నామన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను ఎప్పుడూ కాపుల సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. కాపుల వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానన్నారు. త్వరలోనే కాపుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్‌నాథ్, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, రాష్ట్ర డైరెక్టర్ ఎం. ఆనందరావు, మాజీ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, అడవివరం కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కర్రి అప్పలస్వామి తదితరులు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి జిల్లా కాపునాడు అధ్యక్షుడు తోట రాజీవ్ సమన్వయకర్తగా వ్యవహరించగా, రాష్ట్ర కాపునాడు గౌరవాధ్యక్షులు బి.ఎన్.మూర్తి అన్ని ఏర్పాట్లు చేశారు. తొలుత తోట రాజీవ్ కాపుల సమస్యలను సభావేదికగా విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో అతిథులను సింహాద్రినాథుని జ్ఞాపికలు, గజమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీలా ఉమారాణి వందన సమర్పణ చేయగా నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కాపులు తరలివచ్చారు.