వార్తలు

అక్కడ ‘డాటా ఎంట్రీ ఆపరేటర్లే…ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు’ గా చలామని

టెండర్ల దరఖాస్తులో డాటా ఎంట్రీ ఆపరేటర్ల ఫోన్ నెంబర్లే దర్శనం
ఇఇ నెంబరు అనుకొని ఫోన్ చేస్తే, ఆపరేటర్లే సమాధానాలు
కార్యాలయం పని మీద వచ్చేవారితో నిర్లక్ష్యంగా వ్యవహారం
పట్టించుకోని ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులు
ఇదీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో పరిస్థితి

విశాఖపట్నం : పని చేసేది డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం… బిల్డట్లు మాత్రం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఇఇ) స్థాయి ఫోజులు. మీరు ‘ఇఇ’లా అని ప్రశ్నిస్తే.. అవునని సమాధానం ఇచ్చేందుకు కూడా వీరు వెనుకాడరు. కార్యాలయంలో పనంతా వారి చేతుల మీదుగానే సాగిపోతుందన్నట్లుగా ఫోజులు కొడుతుంటారు. ఇదెక్కడి వ్యవహారమో కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక రాజధానిగా పరుగులు తీస్తున్న విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లోని ఇంజనీరింగ్ విభాగంలోనిదే. ఇక్కడ పనిచేసే కొంతమంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు తమకుతామే ఆ విభాగం ఉన్నతాధికారులుగా ఫీల్ అయిపోతున్నారు. ఉన్నతాధికారుల కోసం వచ్చిన జనాలకు వీరే ఫోజులు ఇచ్చేస్తూ నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారనే ఆరోపణలు ముమ్మరంగా ఉన్నాయి. ఇలాంటి వారి వలనే జీవీఎంసీకి చెడ్డ పేరు వస్తుందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తుండటం గమనార్హం. ఇక అసలు విషయానికి వస్తే జీవీఎంసీలో అతి ముఖ్యమైనది ఇంజనీరింగ్ విభాగం. ఈ విభాగం ద్వారా జరిగే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు జీవీఎంసీ వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. జీవీఎంసీ పరిధిలో జరిగే ప్రతీ ఇంజనీరింగ్ పనికి ‘ ఈ-ప్రొక్యూర్మెంట్’ ద్వారానే టెండర్లు పిలవడం జరుగుతుంది. ఈ టెండర్ దరఖాస్తు విషయంలో ఎవరికైనా ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేసుకునేందుకు వీలుగా అందులో సంబంధిత అధికారి ఫోన్ నెంబరును కూడా పేర్కొంటారు. సాధారణంగా ఆయా టెండర్లలో పనుల విలువను బట్టి చీఫ్ ఇంజనీరు లేదా సూపరిండెంట్ ఇంజనీరు లేదా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుల ఫోన్ నెంబర్లనే పేర్కొంటారు. ‘ ఈ-ప్రొక్యూర్‌మెంట్’ విధానంలో దేశంలోని ఎక్కడ నుంచైనా కాంట్రాక్టర్లు తమ టెండర్లను వేసుకునే సౌలభ్యం ఉంది. దానివలన పోటీ పెరిగి తక్కువ విలువకు కొటేషన్లు వేసిన వారే టెండర్లను దక్కించుకోవడం వలన జీవీఎంసీకి కూడా నాలుగు డబ్బులు మిగిలి, లాభం చేకూరే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లు ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉన్నా ఆయా అధికారులకు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంది. అయితే జీవీఎంసీలో విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. అధికారుల ఫోన్ నెంబర్లుకు కాల్ చేస్తే డాటా ఎంట్రీ ఆపరేటర్లు ‘హలో’ అంటున్నారు. ఇఇ గారేనా మాట్లాడుతున్నారని అడిగితే… అవునంటూ బదులిస్తున్నారు. ఏవైనా సందేహాల గురించి ప్రస్తావిస్తే, ఆఫీసుకు వచ్చి మాట్లాడండీ అని సమాధానం ఇస్తున్నారు. ఆఫీసుకు వచ్చిన తర్వాత వారు నిర్లక్ష్యంగా ఇచ్చే సమాధానాలు చూసి మీరు ఇఇలేనా అని రెట్టించి అడిగితే కాదని చెబుతారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లనీ తెలిసి విస్తుపోవడం సందర్శకుల వంతవుతోంది. జీవీఎంసీలోని జోన్ 2లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
జోన్ 2 ఇఇగా ఆర్.మత్స్యరాజు పనిచేస్తున్నారు. టెండర్లు విషయమై మాట్లాడేందుకు సంబంధిత జోన్ ఇఇ కి ఫోన్ చేస్తే మరో వ్యక్తి సమాధానాలు ఇచ్చారు. అయినా సందేహాలు తీరకపోవడంతో మరుసటి రోజు ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి జోన్ 2- ఇఇ గురించి వాకబు చేయగా, అక్కడున్న బిళ్ల బంట్రోతు ఒక వ్యక్తిని చూపించారు. సదరు వ్యక్తి దగ్గరకు వెళ్లి ఇఇ మీరేనా అని అడగ్గా, అవును నేనే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఒక అధికారి మాట్లాడే తీరు అతనిలో కనిపించకపోవడంతో మళ్లీ రెట్టించి అడగ్గా, తాను డాటా ఎంట్రీ ఆపరేటర్ నని తెలిపాడు. దీంతో సదరు వ్యక్తి విస్తుపోయదీనిబట్టి జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో ఎలాంటి పరిస్తితి నెలకొని ఉందో ఇట్టే అర్ధమవుతుంది. ‘ ఈ-ప్రొక్యూర్‌మెంట్’ విధానంలో దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వారైనా టెండర్లను వేసే సౌలభ్యం ఉంది. ఇతర భాషలకు చెందిన వారికి ఏమైనా సందేహాలు ఉండీ, ఫోన్ చేస్తే వారు మాట్లాడే ఇంగ్లీషు లేదా హిందీ భాషల్లోని ప్రశ్నలకు ఆయా డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఎంతవరకూ సరైన సమాధానాలు ఇవ్వగలరనేది సందేహమే. ఒకవేళ ఇవ్వలేకపోతే, జీవీఎంసీలోని ఇంజనీరింగ్ అధికారులకు తెలుగు తప్ప ఇంగ్లీషు, హిందీ తెలియదా అని ఇతర రాష్ట్రాల అధికారులు భావించే ప్రమాదం కూడా ఉంది. ఇకనైనా ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులు ఈ విషయంపై తగురీతిలో స్పందించి ‘ ఈ-ప్రొక్యూర్‌మెంట్’ దరఖాస్తుల్లో అసలైన ఇంజనీరింగ్ అధికారుల ఫోన్ నెంబర్లనే పేర్కొంటే బాగుంటుంది. ఇదే విషయాన్ని జోన్ 2 ఇఇ ఎస్.మత్స్యరాజు దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ కాల్ కు స్పందించలేదు. చీఫ్ ఇంజనీర్ రవి కృష్ణంరాజు వర్మ ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది.