వార్తలు

జగనన్న ఇళ్ళ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలి : ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్

నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న ఇళ్ళ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పోలీస్ అధికారులతో రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా జగనన్న కాలనీలు ,అర్హులైన వారికి 90 రోజుల్లో ఇళ్లస్థలాలుమంజూరు ,వన్టైమ్ సెటిల్మెంట్, జగనన్న స్మార్ట్ టౌన్షిప్ , ఇళ్ల పట్టాల పంపిణీ, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పనులు, లేబర్ బడ్జెట్, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, బల్క్ మిల్క్ సెంటర్స్, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్,అర్బన్ హెల్త్ క్లినిక్స్, దిశా యాప్ డౌన్లోడ్ కార్యక్రమం, వ్యవసాయం, covid 19, సీజనల్ వ్యాధులు, అక్టోబర్ మాసంలో ప్రారంభించే పథకాలు తదితర అంశాలపై సవివరంగా మాట్లాడారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ -జూన్ మాసాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకానికి సంబంధించి వెరిఫికేషన్ చేయడంతోపాటు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ మాసంలో “జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం” ప్రారంభించడం జరుగుతుందన్నారు.
అక్టోబర్ 25 వ తేదీ నాటికల్లా గృహ నిర్మాణాలకు సంబంధించి బేస్మెంట్ లెవెల్ లను పూర్తి చేయాలన్నారు. నిర్మాణాల వద్ద బోర్ వెల్స్ వేసి నీటి అవసరం కల్పించాలన్నారు. బిల్డింగ్ మెటీరియల్ ను నిల్వ చేయడానికి టెంపరరీ గోడౌన్ ల నిర్మాణాలను చేపట్టాలన్నారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ప్రతివారం లే అవుట్ల పనుల పురోగతిని పరిశీలన చేయాలన్నారు. డిసెంబర్ 31 నాటికి డిజిటల్ లైబ్రరీ ల నిర్మాణాలకు లొకేషన్లను గుర్తించి గ్రౌండింగ్ మొదలుపెట్టాలన్నారు. వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి శతశాతం పూర్తి చేయాలన్నారు.సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి జిల్లాస్థాయి వ్యవసాయ అడ్వైజరీ కమిటీ సమావేశాలను నిర్వహించాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డా ఏ మల్లిఖార్జున, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ,నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా , ఎస్ పి బి .కృష్ణా రావు, జీవీఎంసీ కమిషనర్ జి సృజన, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులు హాజరయ్యారు.