భారత్ వాయిస్,విజయవాడ: తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను తోట్లవల్లూరు పీఎస్ నుంచి విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు సాయంత్రం కోర్టులో హాజరుపర్చారు. ఈసందర్భంగా పట్టాభికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పట్టాభిపై గతంలోనే అనేక కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించారు. అంతకు ముందు ప్రభుత్వాసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఎం జగన్‌పై పట్టాభి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య ఆయనను నిన్న రాత్రి 10 గంటలకు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిని దూషించినట్లుగా గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో అందిన పిర్యాదు మేరకు పట్టాభిపై సెక్షన్ 153 (ఎ), 505(2), 353, 504 రెడ్ విత్ 120(బి) కింద (క్రైం నంబర్.352/2021) కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం రాత్రి గురునానక్‌నగర్‌లోని కనకదుర్గ ఆఫీసర్స్ కాలనీలో రోడ్ నంబర్ 7లోని ప్లాట్ నంబర్ 22లో పట్టాభి ఇంటికి చేరుకున్నారు. కాలింగ్‌బెల్ కొట్టినా స్పందించకపోవటంతో కొంతసేపు సంయమనంగా వ్యవహరించిన పోలీసులు తరువాత సీఆర్పీసీ సెక్షన్ 50(3) మేరకు నోటీసు ఇచ్చారు. అనంతరం గవర్నర్‌పేట సీఐ ఎం.వి.ఎస్.నాగరాజ ఆయన్ని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పట్టాభి భార్య చందన పోలీసుల తీరును తప్పుపట్టారు. తన భర్త ఇంట్లో కూడా అసభ్యంగా మాట్లాడరని అన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదన్నారు. గతంలో ఇంతకంటే దారుణంగా మాట్లాడిన వారున్నారని, కానీ అప్పుడు స్పందించని ప్రభుత్వం ఇప్పుడు కావాలనే అరెస్టు చేయించిందని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే తర్వాత ఇస్తామని పోలీసులు చెప్పారని పేర్కొన్నారు. తన భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. పోలీసులపై నమ్మకం లేదని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.
తెదేపా అధికార ప్రతినిధి పట్టాభికి 14 రోజుల రిమాండ్
