వార్తలు

పవన్ కళ్యాణ్ పోరాడితే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది -గంటా శ్రీనివాస రావు

(భారత్ వాయిస్, తిరుపతి) : మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల తన ఎం ఎల్ ఏ పదవికి రాజీనామా చేసారు. ఈ నేపథ్యంలో ఆయన తిరుపతి ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. అందుకే తాను ఎం ఎల్ కె పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. అయితే తన రాజీనామాను కొందరు రాజకీయం చేస్తున్నారని , అటువంటి చర్యలు సరికాదని చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు వ్యతిరేకంగా అందరూ ఉద్యమించాలని అన్నారు. ఆ పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకోసం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు ముందుకు రావాలని , ఆయన ఆ బాధ్యతను తీసుకుంటే తానూ కలిసి నడుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారని అన్నారు. చివరి అసరంగా రాజీనామాలు చేసే సమయం ఆసన్నమైందని తెలిపారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ అండ్ టీడీపీ లీడర్ లాలం భాస్కర్  తదితరులు పాల్గొన్నారు.