వార్తలు

ప్రణాళిక ప్రకారం పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ : జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్

విశాఖపట్నం, మార్చి 8: జివియంసి ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సామగ్రి పంపిణీ చేయడం, పోలింగ్ పూర్తయిన తరువాత స్వీకరించేందుకు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని జిల్లా ఎనికల అథారిటీ, జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన, జివియంసి కమిషనర్ నాగలక్ష్మి నగరంలోని పంపిణీ కేంద్రాలైన ఎ.యు. ఇంజనీరింగ్ కళాశాల, జ్ఞానాపురం సోఫియా కళాశాల, బి.హెచ్.పి.వి ఉన్నత పాఠశాల, వేపగుంట రవినగర్ భాష్యం కళాశాలలను సందర్శించి ఏర్పాట్లును పరిశీలించారు. బస్సులు, వాహనాలు వచ్చిపోయేందుకు విశాలమైన మైదానంలో లోపలికి, బయటకు వేరుగా మార్గాలు వుండాలన్నారు. సామగ్రి పంపిణీ కౌంటర్ల ప్రాంగణం విశాలంగా వుండాలని, పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, అల్పాహారం, భోజన సదుపాయాలు అందుబాటులో వుండాలని, వేసవి మొదలైనందున ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కౌంటర్ల వద్ద అందరికీ కనిపించే విధంగా బోర్డుల ఏర్పాటు, మైకులలో ప్రకటిస్తూ వుండాలన్నారు. ఎవరికీ ఇబ్బందిలేకుండా తగిన సమాచారం అందజేస్తూ వుండాలన్నారు. పోలింగ్ అనంతరం సామగ్రి స్వీకరణ కూడా జాగ్రత్తలు పాటిస్తూ తీసుకోవాలన్నారు. కౌంటర్ల వద్ద తశీల్దార్ లేదా ఎంపిడివో స్థాయి అధికారులను నియమించాలన్నారు. అధికారులు సమన్వయంతో ఎటువంటి అవాంతరాలు లేకుండా పటిష్టంగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.పెంచల కిషోర్, ప్రత్యేక ఉపకలెక్టర్లు అనిత, పద్మలత, జివియంసి ఎస్.ఈ. వెంకటేశ్వరరావు, జోనల్ కమిషనర్లు సింహాచలం, చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.