వార్తలు

ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ సదుపాయంతో డిజిటల్ లైబ్రరీలు

ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ సదుపాయంతో డిజిటల్ లైబ్రరీలను
ఏర్పాటు చేయుటకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23, 2021
ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలో ఒక డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇటీవల చేసిన ప్రకటన అని సొసైట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ ప్రెసిడెంట్ పి.ఎస్.ఎన్. మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాటల్లో..

” మా లాంటి చాలామంది పౌరగ్రంథాలయ పరిపాలకులకు వీనుల విందుగా ఉంది. ప్రస్తుత కోవిడ్`19 మహమ్మారి కారణంగా అన్ని విద్యాసంస్థలు మూసివేయబడిన సమయంలో, విద్యార్థులు మరియు యువతి పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి స్టడీ మెటీరియల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం అందించాలనే విప్లవాత్మక ఆలోచన స్వాగతించదగిన మంచి ప్రతిపాదన. ఈ ప్రతిపాదన ప్రకారంగా, మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామపంచాయితీల పరిధిలో రూ. 140 కోట్ల వ్యయంతో 4,530 డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు జరగనుంది. ప్రతి గ్రంథాలయంలో మూడు కంప్యూటర్లు, యు.పి.ఎస్., బార్ కోడ్ ప్రింటర్, స్కానర్, లేజర్ ప్రింటర్, యాంటీ`వైరస్ సాఫ్ట్వేర్ మరియు హై`స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉంటాయి. మౌళిక సదుపాయాల రూపములో మూడు టేబుళ్లు, కుర్చీలు, సందర్శకుల కుర్చీలు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, బీరువాలు, వార్తాపత్రికలు కూడా వుంటాయి. ఈ డిజిటల్ గ్రంథాలయాలు స్థాపించడం వలన గ్రామీణ ప్రాంతాల్లోని వేలాదిమంది విద్యార్థులకు మరియు సాధారణ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో నున్న 13 జిల్లాల పౌరగ్రంథాలయ వ్యవస్థలో ఉన్న గ్రంథాలయాలను, డిజిటల్ గ్రంథాలయాల మాదిరిగా అభివృద్ధి చేయుట వల్ల ఎంతోమంది యువతకు ఉపయోగపడి, వారి విజ్ఞానాభివృద్ధి, ఉద్యోగ సంపాదనకు దోహదపడతాయి. తద్వారా జీవనోపాధికి ఎక్కువ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వానికి యువత ఋణపడి వుంటుంది.
2011 సంవత్సరంలో ‘‘సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్, రిజిస్ట్రర్ నెం. 354/2011 విశాఖపట్నం వారు ‘‘కార్పొరేట్ సామాజిక బాద్యత ద్వారా పౌర గ్రంథాలయాలకు కూడా వారి నిధుల నుండి సొమ్మును గ్రంథాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందించవలసినదిగా కోరుట జరిగింది. తద్వారా అప్పటి గౌరవ మంత్రివర్యులు శ్రీ సచిన్ పైలట్ గారు ఆమోదించి చట్టంలో చేర్చుట జరిగింది. ఏక్ట్లో పొందుపరచుట జరిగింది. ఆ విధంగా ‘‘సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్’’ కృషి వలన నిధులు అన్ని పౌర గ్రంథాలయాలకు ఉపయోగించుకునే అవకాశం కలిగింది.
గ్రంథాలయాలు సామాజిక సంస్థలు కాబట్టి, వాటి స్థాపన మరియు నిర్వహణ కొరకు సమాజం కూడా బాధ్యత వహించాల్సి ఉంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి అనేది ఒక అరుదైన అవకాశం. కంపెనీల చట్టం 2013 ప్రకారం, కంపెనీలు తమ నికర లాభాలలో 2% సి.ఎస్.ఆర్. కింద ప్రజా సౌకర్యాలను అందించడం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా పౌర గ్రంథాలయాలను కార్పొరేట్ సంస్థలు మరియు పి.ఎస్.యూస్ లు సి.ఎస్.ఆర్. నిధుల నుండి నిర్వహించుటకు ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ క్రమంలో, ఇన్ఫోసిస్, విప్రో, జి.ఎం. ఆర్. మొదలగు పెద్ద కంపెనీలు ఇప్పటికే విద్య, ఆరోగ్యం, రోడ్లు, నీరు మరియు పారిశుద్ధ్య రంగంలో అద్భుతమైన సేవలు అందిస్తున్నాయి,
విశాఖపట్నంలో ఉన్న సొసైటి ఫర్ ప్రమోషన్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ సి.ఎస్.ఆర్. నిధులతో పౌరగ్రంథాలయాలు ఏర్పాటు మరియు వాటి అభివృద్ధి కోసం ఒక దశాబ్ద కాలం పైగా కృషి చేస్తూ ఉంది. దీనికి పి.ఎస్.ఎన్. మూర్తి వ్యవస్థాపక అధ్యక్షులు పౌర గ్రంథాలయాలు ఉన్నతికి పాటు పడుతూ వస్తున్నారు. మన పౌర గ్రంథాలయాలు సి.ఎస్.ఆర్ పద్దతిని స్వీకరించి , ప్రభుత్వ నిధులతో కలిపి బాగా అభివృద్ధి చేయవచ్చు. ఈ దిశగా విశాఖపట్నంలో నెలకొని ఉన్న పి.ఎస్.యు. లు తమ సి.ఎస్ ఆర్. నిధులతో విశాఖ పౌర గ్రంథాలయానికి సహాయం అందించడం జరిగింది. ఈ పౌర గ్రంథాలయం పబ్లిక్`ప్రైవేట్`భాగస్వామ్యానికి ఒక ఉత్తమ ఉదాహరణ. ఇటువంటి అనేక గ్రంథాలయాలు ఇరత రాష్ట్రాలలో కూడా పనిచేస్తున్నాయి.
ఆంధ్ర రాష్ట్రాలలో పౌర గ్రంథాలయాలు : ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 3,069 పౌర గ్రంథాలయాలు 13 జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. అవి 4 ప్రభుత్వ గ్రంథాలయాలు, 13 జిల్లా/నగర కేంద్ర గ్రంథాలయాలు, 887 శాఖ గ్రంథాలయాలు, 1,847 పుస్తక డిపాజిట్ కేంద్రాలు, 66 సంచార గ్రంథాలయాలు మరియు 252 గ్రామీణ గ్రంథాలయాలు. వీటి నిర్వాహణ కొరకు గ్రంథాలయ రాష్ట్ర డైరెక్టరేట్కు మునిసిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయితీలు అందించే 8% లైబ్రరీ సెస్ నిధులు ద్వారానే మనగలుగుతున్నాయి. ఈ సొమ్ము వెంటనే పౌరగ్రంథాలయాలకు జమ చేయుట ఆలస్యమవుతున్నది. తద్వారా నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రతి గ్రామంలో ఒక కొత్త డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడం డబ్బు, సమయం, కృషితో కూడిన పని కాబట్టి, ప్రభుత్వం సమన్వయం పాటించవలసి ఉంది. ఈ బృహత్తర కార్యం సాధించడానికి స్థానిక గ్రంథాలయ అధికారులు, గ్రంథాలయ సంఘాలు మరియు గ్రంథాలయ వినియోగదారుల సలహాలు కార్యసాధనకు దోహాదం చేస్తాయి అని మా అభిప్రాయం. సరి క్రొత్త గ్రంథాలయాలను సృష్టించడం మరియు రాష్ట్రంలో ఉన్న 252 గ్రామీణ గ్రంథాలయాలను పరిగణనలోనికి తీసుకొని వాటిలో ఇంటర్నెట్ సదుపాయం దశల వారీగా కల్పించి పెంపొందించడం సరైనదని మా అభిప్రాయం.
భారత ప్రభుత్వం చేపట్ట్టిన గ్రంథాలయాల అభివృద్ధి కార్యక్రమాలు : భారత ప్రభుత్వం గత ఐదు దశాబ్దాలలో గ్రంధాలయాలను ఆధునీకరించడానికి, గ్రంథాలయ సేవలను మెరుగు పరచడానికి సమాచార సాంకేతికతను పెంపొందించడానికి మరియు వివిధ గ్రంథాలయాలను అనుసంధానం చేయడానికి ఎన్నో ప్రాజెక్టులను చేపట్టింది. ఈ దిసగా, జాతీయ గ్రంథాలయ వ్యవస్థను పునరుద్దరించడానికి మరియు దేశవ్యాప్తంగా గ్రంథాలయాలకు సహాయం అందించటానికి 1972 లో రాజా రామ్మోహన్ రాయి ఫౌండేషన్ను కూడా స్థాపించింది. ఈ సంస్థ వలన కొంత పురోగతిని సాధించినప్పటికీ, ఇంకా చేయవలసిన అవసరం ఎంతో ఉంది.
గత కొద్ది సంవత్సరాలుగా, వివిధ గ్రంథాలయాలతో సహా అనేక సంస్థలు వేర్వేరు డిజిటల్ లైబ్రరీ కార్యక్రమాలు మరియు డిజిటటైజేషన్ కార్య కలాపాలను నిర్వహించాయి. వాటిలో చాలా వరకు ప్రభుత్వ నిధులతో చేపట్టినవే. విశాలమైన భారతదేశంలో డిజిటల్ లైబ్రరీ రూపకల్పన మరియు అమలు ఎల్లప్పుడూ సవాలుతో కూడుకున్న పనే. 2005లో, విజ్ఞానవ్యాప్తి మరియు మెరుగైన విజ్ఞాన సేవలను అందించడం కోసం నేషనల్ నాలెడ్జి మిషన్ స్థాపించబడిరది. విజ్ఞానాన్ని ఉచితంగా అందించడం, విజ్ఞానాన్ని సృష్టించడం మరియు పరిరక్షించడం దీని మూల లక్ష్యం. తరువాత, 2012 లో సాంస్కృతిక మంత్రిత్వశాఖ రూ. 1,000 కోట్ల బడ్జెట్తో నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్ ఏర్పాటు చేయుట జరిగింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా దాదాపు 9,000 పౌర గ్రంథాలయాలను ఆధునీకరించడం మరియు అంతర్జాలంతో లింక్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పౌరులందరికీ సమాచారం మరియు జ్ఞానాన్ని అందుబాటులో ఉంచడానికి దేశవ్యాప్తంగా పౌర గ్రంథాలయ వ్యవస్థలు మరియు సౌకర్యాల పునరుజ్జీవన పనులు చేపట్టింది. అదేవిధంగా, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఐ.ఐ.టి. ఖరగ్పూర్ ‘‘నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ పైలట్ ప్రాజెక్ట్ 2015లో ప్రారంభించబడిరది. ఈ డిజిటల్ లైబ్రరీ భారతదేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ ఇ`లెర్నింగ్ పోర్టల్ గా గుర్తింపు కలిగినది. ఇందులో సుమారు 4.6 కోట్ల భారతదేశ విద్యా వనరులు మరియు ఇతర ప్రపంచ దేశాల విద్యా వనరులు పొందుపరిచి, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు ‘‘నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’విజయవంతంగా పనిచేస్తోంది. ఈ ‘‘నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ద్వారా ఎక్కడ నుంచైనా కావలసిన పుస్తకాలను మనం ఉచితంగా చదువుకొనవచ్చు మరియు పొందవచ్చు.
ఆంధ్రప్రదేశ్లో లైబ్రరీ సైన్స్ చదివి 30 వేళ మందికి పైగా నిరుద్యోగులుగా వున్నారు. వీరిని డిజిటల్ లైబ్రరీలో కొంతమందికైనా అవకాశం కల్పిస్తే వారికి మీ ద్వారా జీవనోపాధి దొరుకుతుంది మరియు వారు ఎల్లప్పుడూ మీకు ఋణపడి వుంటారు. దయ ఉంచి మీరు కొంతమంది కైనా అవకాశం కల్పిస్తారని ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు తెలుపుతూ, సహృదయంతో మా విన్నపాన్ని మన్నించవలసినదిగా కోరుచున్నాము.
‘‘మనమందరం సామాజిక అభివృద్ధి కోసం కృషి చేద్దాం’’