వార్తలు

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం రాజ్యాంగ ధర్మం కాదు :యుపిఎస్సి పూర్వ ఛైర్మన్ ప్రొఫెసర్ కె యస్.చలం.

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్లాలి
కార్పొరేట్ రంగానికి చేసిన రుణమాఫీ లో రెండు శాతం స్టీల్ ప్లాంట్ కు యిస్తే గట్టెక్కుతుంది

భారత్ వాయిస్ :

విశాఖపట్నం, ఫిబ్రవరి 27.
ప్రభుత్వ రంగ సంస్థలు ప్రవేట్ పరం చేయడం రాజ్యాంగ ధర్మం కాదని , రాజ్యాంగంలోని ఇండస్ట్రియల్ పాలసీ లో కూడా ఇదే వుందని,ఈ పాలసీని నెహ్రూ కూడా ఆమోదించారు అని యూపీఎస్సీ మాజీ చైర్మన్ మాజీ వీసీ ప్రొఫెసర్ కె యస్.చలం అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు సంస్థలకు ఇస్తే ఈ ప్రాంత అస్తిత్వం కోల్పోతుందన్నారు. శనివారం కూర్మన్న పాలెం వద్ద జరుగుతున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పబ్లిక్ సెక్టార్ లో ప్రైవేట్ పరం చేయడం రాజ్యాంగ ధర్మానికి విరుద్ధమన్నారు. తెలుగు వారంతా ఈ సంపదను ప్రైవేటు వారికి అమ్మడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. తామంతా దేశభక్తులమని చెప్పుకుంటున్న వారు దేశ సంపదను విదేశీయులకు దోచి పెట్టడం దేశభక్తి ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రస్తుతం సిద్ధాంతపరమైన పోరాటం జరుగుతుందన్నారు .గత 50 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలో కార్మికులు భాగస్వాములయ్యారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సంపదని తెలిపారు. స్టీల్ ప్లాంట్ లో ఉన్న పెట్టుబడులు పేదలేనని ,కొంతమంది పేద రైతు భూముల త్యాగం చేయడం ద్వారా వచ్చిందన్నారు. రిజర్వేషన్లు, ప్రమోషన్లు అమలు జరగాలంటే పబ్లిక్ సెక్టార్ లు ఉండాలి అన్నారు. భవిష్యత్తు తరాలకు పబ్లిక్ సెక్టార్ లేకపోతే ఉద్యోగాలు రావని అన్నారు. కార్పొరేట్ రంగానికి 12 లక్షల కోట్లు ఇచ్చిన రుణమాఫీ లో రెండు శాతం స్టీల్ ప్లాంట్ రుణ మాఫీ చేస్తే లాభాల్లోకి వస్తుందని అన్నారు. దేశాన్ని డిమానిటైజేషన్ ఇంకా వెంటాడుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ భూములు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందా సెయిల్ కు బదిలీ చేశారా అనేది స్పష్టం చేయాల్సి ఉందన్నారు .స్టీల్ ప్లాంట్ బ్యాలెన్స్ షీట్ లో ఈ విషయాన్ని ప్రస్తావించలేదు అన్నారు.స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ,కేంద్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కావాలని నష్టాల్లో చూపిస్తూ ప్రైవేట్ రంగంలో కి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ తెలుగువారి సూక్తం ఇది లేకపోతే అస్తిత్వాన్ని ,ఐడెంటిటీ కోల్పోతున్నామన్నారు . పబ్లిక్ రంగాన్ని కొనుగోలు చేస్తున్న కార్పొరేట్ వస్తువులను పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నాయకులు అంబేద్కర్ ,బోసు బాబు, కే గంగారావు, ఎస్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.