వార్తలు

రహదారి కబ్జా

 

కళ్లు మూసుకున్న సబ్ రిజిస్ట్రార్

తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్

వీటి ఆధారంగా స్థల యజమానులకు బెదిరింపులు

లబోదిబో మంటున్న బాధితులు

భారత్ వాయిస్, విశాఖపట్నం : నగరంలోని సొంత స్థలం యజమానులారా… బహుపరాక్ . భూముల ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పది సంవత్సరాల క్రితం వేలు రూపాయలు చేసే ఇంటి స్థలాలు ఇప్పుడు కోట్ల రూపాయలుగా విలువ పెంచుకుంటున్నాయి. దీంతో సొంత వ్యక్తులే కబ్జారాయుళ్లుగా మారిపోతున్నారు. ఇక బయట వ్యక్తుల సంగతి సరేసరి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులను లంచాలిచ్చి లోబర్చుకొని పరాయి స్థలాలను దొంగ డాక్యుమెంట్లతో హస్తగతం చేసుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే… మీ దిక్కున్న చోట చెప్పుకోండి, నన్నేమీ చేయలేరు. ఒకవేళ కోర్టులకు వెళ్లినా కేసు తేలేటప్పటికి సంవత్సరాలు పడుతుంది. కింద కోర్టులో ఓడిపోతే ..పై కోర్టుకి వెళ్తాం ” అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇలాంటి సంఘటనలు మీడియా ద్వారా వెలుగులోకి వచ్చినవి కొన్ని అయితే, వెలుగులోకి రానివి మరెన్నో… ఇలాంటి తరుణంలో రెండు వరసల్లో వేసిన ఇళ్ల స్థలాల మధ్య నున్న రహదారిని తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకొని, దాని ఆధారంగా సదరు రహదారి పక్కనున్న ఇంటి స్థలాల యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బాధితుడు శరత్ కుమార్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిసిన వివరాల్లోకి వెళ్తే….

విశాఖ జిల్లా మధురవాడ ప్రాంతానికి చెందిన పిళ్ల సన్యాసిరావు, పిళ్లా అప్పచ్చమ్మలు అదే ప్రాంతంలోని సర్వేనెంబరు 242/13లో తమకు చెందిన సుమారు ఎ.0.53 సెంట్లు భూమిని ఏడు ప్లాట్లుగా వేసి సత్యనారాయణ, మురళీధర్, శారద, శశికుమార్, భారతి, కళ్యాణినాయ్లు, బెవర సుగున తదితరులకు అమ్మేశారు. సదరు భూమిలో 1 నుంచి 4 వ నెంబరు ప్లాట్లు ఒక వరుసలోనూ, 5 నుంచి 7వ నెంబరు ప్లాట్లు మరో వరుసలోనూ ఉండగా వాటి మధ్యలో సుమారు 15 అడుగులకు మించి అంటే 27 అడుగుల రస్తాను రహదారి సౌకర్యం నిమిత్తం వేశారు. ఇందులో 5వ నెంబరు ప్లాటు యజమాని అయిన బెవర సుగున ప్లాట్ను తన ఇద్దరు కుమారులైన బెవరా షీర్ కుమార్, బెవరా శరత్ కుమార్ల పేరున మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. బెవరా షీర్ కుమార్ అమెరికాలోనూ, శరత్ కుమార్ బెంగుళూరులోనూ ఉద్యోగ రీత్యా నివాసం ఉంటున్నారు. ఇదిలాఉండగా ఈ రెండు వరసల ప్లాట్ల మధ్య తూర్పు పడమరలకు 27 అడుగులు, ఉత్తర దక్షిణములకు 65 అడుగులు చొప్పున మొత్తం 195 చదరపు గజాలు విస్తీర్ణం గల రహదారి స్థలం కబ్జాకు గురైంది. ఈ కబ్జా పర్వం వెనుక చాలా గమ్మత్తు సంఘటనలు చోటు చేసుకున్నాయి. సదరు స్థలం 195 చదరపు గజాలు సంచాన రామమోహనరావు అనే వ్యక్తి పేరున విజయనగరం జిల్లా, గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 1223/2016 డాక్యుమెంట్ నెంబరు ద్వారా రిజిస్ట్రీ కాబడింది. సదరు స్థలాన్ని రామమోహణరావుకు అమ్మినది సంచాన అప్పలస్వామి కుమారుడు సంచాన సత్యనారాయణ. సదరు స్థలం 1984వ సంవత్సరం, ఆగస్టు నెల 9వ తేదీన మధురవాడ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా పిల్లా సన్యాసిరావు, పిళ్లా అప్పచ్చమ్మ గార్ల ద్వారా తనకు సంక్రమించినట్లు డాక్యుమెంట్ నెంబరు 1223/2016లో లో పేర్కొనడం జరిగింది. అయితే సదరు డాక్యుమెంట్లో పేర్కొన్న రిజిస్ట్రేషన్ నెంబరు ఏడు ప్లాట్లలోని 3వ నెంబరు ప్లాటుకు సంబంధించినది. మరి మూడవ నెంబరు ప్లాటు సంబంధించిన స్థలాన్ని రహదారి స్థలానికి ఎలా అన్వయించారు. ఇందులో పాత్రధారులు ఎవరు. అని ప్రశ్నించుకుంటే బాధితులు సంచాన మురళీధర్ అనే వ్యక్తిని తెరమీద చూపిస్తున్నారు. రహదారి స్థలాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారంటూ బాధితుడు శరత్ కుమార్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జిల్లా కార్యాలయాన్ని ఆశ్రయించారు. సదరు అధికారి బాధితుడు శరత్ కుమార్ అందించిన అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి, వీటిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు విలేకరుల సమావేశంలో శరత్ కుమార్ తెలిపారు. అలాగే రహదారిని తప్పుడు డాక్యుమెంట్లతో కబ్జా చేయడమే కాకుండా తమ పేరున ఉన్న 5వ నెంబరు స్థలాన్ని తనకు అప్పగించాలనీ, లేకుంటే రహదారి సౌకర్యం లేకుండా చేసేస్తానంటూ మురళీధర్ తమను భయాందోళనలకు గురిచేస్తున్నాడంటూ పోతినమల్లయ్యపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విలేకరుల సమావేశంలో శరత్ కుమార్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అడ్వకేట్ పతివాడ అప్పన్న పాల్గొన్నారు.