వార్తలు

రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కృషి

పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
విశాఖపట్నం, సెప్టెంబరు 27: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సోమవారం విఎమ్ఆర్ డిఎ చిల్డ్రన్ ఎరీనాలో మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా ఎక్కువగా దెబ్బతిన్నది పర్యాటకరంగమని అన్నారు. కరోనా పరిస్థితులకు ముందు ఏడాదికి రూ.130 కోట్ల ఆదాయం వచ్చే రాష్ట్ర పర్యాటకం ఇప్పుడిప్పుడే పుంజుకుంటుందన్నారు. రాజకీయ ప్రత్యర్థులు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసేముందు ఈ విషయం గ్రహించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చి రాష్ట్ర పర్యాటకాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. 13 జిల్లాల్లో 5 స్టార్ హోటల్స్ నిర్మించే క్రమంలో విశాఖ, తిరుపతి నగరాల్లో హోటల్స్ నిర్మించేందుకు ఒబెరాయ్ హోటల్స్ ముందుకు వచ్చిందనీ కరోనా కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 950 కి.మీ. సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. లంబసింగిలో కూడా పనులు ప్రారంభించామని, మౌలిక వసతులు కల్పిస్తున్నామని, శ్రీకాకుళం నుంచి హార్స్ లీ హిల్స్ వరకూ టూరిజం పరంగా రూ.70 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. రుషికొండలో హోటల్ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. పీపీపీ పద్దతిలో ఇన్వెస్టర్స్ ను ఆకర్షించి పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం పరంగా ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు. ఇప్పటికే రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలతో నాలుగు రీజియన్లుగా రాష్ట్ర టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేశామని చెప్పారు. పర్యాటకులకు 3 రోజుల ప్యాకేజీని కూడా సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆరు ఎయిర్ పోర్టులను, రోడ్డు, రైల్ కనెక్టివిటీని టూరిజంకు ఉపయోగించుకుని టూరిస్టులను ఆకర్షిస్తామన్నారు. ప్రస్తుతం కరోనా నిబంధనలతో రాష్ట్రంలో పర్యాటక రంగం నడుస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి అనేక ప్రకాళికలు సిద్ధం చేశామని ఏపీ టూరిజం శాఖ ఎం.డీ ఎస్. సత్యనారాయణ తెలిపారు. పర్యాటకంగా దేశంలో ఏపీ ఎంతో కీలకమైన రాష్ట్రమని తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి నిచ్చే రంగం టూరిజం అని అన్నారు. వాణిజ్య పోర్టల్ ద్వారా టూరిజంను సులభతరం చేస్తామని అన్నారు. 2020-25 టూరిజం పాలసీలో భాగంగా విద్యుత్ రీయంబర్స్ మెంట్ ను యూనిట్ 2 రూపాయలకే ఇస్తామని అన్నారు. మెగా టూరిజంలో భాగంగా ల్యాండ్ అలాట్ మెంట్, స్టాంపుడ్యూటీ, జీఎస్టీ మినహాయింపు ఇస్తామన్నారు. టూరిజం అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని. అందుకుతగ్గ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ‘ ఇప్పటికే 20 టూరిస్ట్ ప్యాకేజీలు అమలు చేస్తున్నామని, రాష్ట్రంలో బుద్ధిజం సర్క్యూట్ అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర జీడీపీలో పర్యాటకం పెరగాలనేది సీఎం లక్ష్యమని అందుకు తగ్గట్టుగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
జిల్లా కలెక్టరు డా.ఏ.మల్లికార్జున మాట్లాడుతూ కరోనా కారణంగా పర్యాటకరంగం వెనకబడిందన్నారు. విశాఖపట్నం జిల్లాలో పర్యాటకంగా ఎన్నో ఆకర్షణీయమైన స్థలాలు, అంశాలు వున్నాయన్నారు. టూరిజం పాలసీ దృష్మ్యా మనం వేగంగా అడుగులు వేయాలన్నారు. జిల్లాలో 8 బీచ్ ల అభవృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. రుషికొండ బ్లూఫ్లాగ్ సర్జిఫికేషన్ పొందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో ఎన్నో టూరిజం ప్రాజెక్టులు జరుగుతున్నాయన్నారు. హోటలియర్స్ అసోషియేషన్ ప్రతినిధులు లోన్స్ కు సంబంధించి చర్చించడానికి బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. బీచ్ రోడ్డులో శని, ఆదివారాలలో సందర్శకులను ఈనెల 30వ తేదీ తరువాత కోవిడ్ నిబంధనలకు లోబడి అనుమతిస్తామని చెప్పడంతో సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అరిమండ వరప్రసాద్ రెడ్డి, నగర మేయర్ హరి వెంకట కుమారి, వీఎంఆర్దేఏ చైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల, ఎంపీలు డాక్టర్ బి.సత్యవతి, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, గొల్ల బాబూరావు, తిప్పల నాగిరెడ్డి, ఏమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, గిరిజన కార్పొరేషన్ చైర్ పర్సన్ శోభా స్వాతిరాణి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, చైర్ పర్సన్లు, హోటల్ అసోసియేషన్, ట్రావెల్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.