వార్తలు

3 గంటల్లో హైదరాబాద్ నుంచి ముంబైకి

హైస్పీడ్‌ రైలుకి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక

హైదరాబాద్, ముంబై వాసులకు మరో అత్యాధునిక రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌-ముంబయి మధ్య బుల్లెట్‌/హైస్పీడ్‌ రైలు మార్గాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మెట్రోరైలు ప్రాజెక్టుతో హైద్రాబాద్లో ప్రయాణం ఎంతో సౌలభ్యంగా మారింది. ఐటీ రంగంలో పనిచేసే వారు సహా పలువురు నగరంలోని తమ గమ్యస్థానాలకు వేగంగా చేరుకోగలుతున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరానికి కూడా మూడు గంటల వ్యవధిలోనే చేరుకొనే సదుపాయం త్వరలో సాకారం కానుంది. హైదరాబాద్‌-ముంబయి మధ్య మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల భూభాగాల్లో మొత్తం 11 స్టేషన్లు ఉంటాయి. సంబంధిత వివరాలను ఠాణె జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ ప్రశాంత్‌ సూర్యవంశీ, ఇతర అధికారులకు జాతీయ హైస్పీడ్‌ రైలు కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎన్‌.కె.పాటిల్‌ దృశ్యరూపంలో వివరించారు. పూర్తి ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌-ముంబయిల మధ్య దూరం 650 కి.మీ. కాగా ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి దాదాపు 14 గంటల సమయంపడుతోంది. అదే బుల్లెట్‌ రైలు అందుబాటులోకి వస్తే మూడు గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే సర్వే చేపట్టింది. భూసేకరణపైనా దృష్టి సారించింది. దీనిలో భాగంగా మహారాష్ట్రలోని ఠాణె జిల్లా అధికారులకు ప్రతిపాదిత బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు సమాచారాన్ని తెలియజేసింది.