COLLECTORATE

గులాబీ నష్టాలపై యుద్ధ ప్రతాపదికన చర్యలు చేపట్టాలి

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్

భారత్ వాయిస్, విశాఖపట్నం : గులాబ్ తుఫాన్ లో ఏర్పడిన నష్టాలను గుర్తించి యుధ్ధ ప్రాతిపదికన మరమత్తులు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తుఫాను నేపథ్యంలో చేపడుతున్న చర్యలపై జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జునను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ పునరావాస కేంద్రాలలో ఉన్న వారికి నాణ్యమైన బోజన, మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో మెడికల్ క్యాంపు నిర్వహించవలసిందిగా ఆదేశించారు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున శానిటేషన్, క్లోరినేషన్ తప్పనిసరి అన్నారు. విద్యుత్తుకు సంబందించి ఇంకా కొన్ని ప్రాంతాలలో సబ్ స్టేషన్స్ మరమ్మతులు ఉన్నాయని వెంటనే తగు చర్యలు చేపట్టి ఆయా ప్రాంతాలలో2,3 గంటలలో విద్యుత్ సౌకర్యం కల్పించాల్సిందిగాఎ.పి.ఇ.పి.డి.సి.ఎల్ అధికారులను గ్రామీణ ప్రాంతాలు మండలాలు ఆనందపురం, పధ్మనాభం లలో చెట్టు కొమ్ములు విద్యుత్తు స్తంబాల మీద పడ్డాయని సిబ్బంది ఆయా పనులను చేస్తున్నారని ఈ పి డి సి ఎల్ ఎస్.ఇ తెలుపగా ఈ రాత్రికి సంబందిత పనులన్నింటిని పూర్తి చేసి విద్యుత్తు సౌకర్యం కల్పించాల్సిందిగా ఆదేశించారు. ఇరిగేషన్ కు సంబందించి 55చెరువులకు చిన్న చిన్న మరమ్మత్తులు వచ్చాయని ఇరిగేషన్ ఎస్.ఇ తెలిపారు. చోడవరం, సబ్బవరం ప్రాంతాలలో కల్వర్టులు కొట్టుకు పోయాయని మరమ్మత్తులను చేపట్టడం జరుగుతున్నదని పంచాయితీ రాజ్ ఎస్.ఇ తెలిపారు. 13 ప్రాంతాలలో చెట్లు విరిగి పడ్డాయని, 28 చోట్ల రోడ్లు మీద నీరు ప్రవహిస్తున్నదని, సుమారు 289 కిలో మీటర్ల మేర రోడ్డు డామేజ్ అయిందని ఆర్ అండ్ బి ఎస్ ఇ తెలిపారు.
జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ తుఫాను ప్రభావిత లోతట్టు ప్రాంతాలలో ప్రజలను తరలించి పునరావాస కేంద్రాలలో పెట్టడం జరిగిందని, వారికి బోజన, వసతి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. కాలనీలలో నిల్వ ఉన్న నీటిని ప్రత్యేక మోటార్లు ద్వారా తొలగించడం జరుగుతుందని తెలిపారు. విద్యుత్తు అంతరాయం కలిగిన ప్రాంతాలలో సబ్ స్టేషన్ల మరమ్మత్తులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఈ సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, జాయింట్ కలెక్టర్లు ఎం వేణుగోపాల్ రెడ్డి, పి అరుణ్ బాబు, జీ వీ ఎం సీ కమీషనర్ జి సృజన,ఎస్ పీ బీ కృష్ణా రావు,డి.ఎం .అండ్.హెచ్ .ఓ, ఆర్ అండ్ బి , పంచాయితీరాజ్, ఇరిగేషన్, ఎ.పి.ఇ.పి.డి.సి.ఎల్., అధికారులు తదితరులు హాజరయ్యారు.