COLLECTORATE

“స్పందన”కు ప్రతిస్పందన ఎంత

రెవెన్యూ విభాగంలో అంతులేని నిర్లక్ష్యం
సమస్య పరిష్కారం అయిందంటూ బూటకపు సమాచారాలు
సమస్యలు పరిష్కారం కాక మళ్లీ మళ్లీ కలెక్టరేట్‌కు దరఖాస్తుదారులు
దరఖాస్తుదారులకు ఆర్థిక ఇబ్బందులు
ప్రయాణ సౌకర్యాలు లేక ఆపసోపాలు
భారత్ వాయిస్, విశాఖపట్నం :
స్పందన… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక అద్భుతమైన కార్యక్రమం. మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిష్కారం కాని ప్రజల సమస్యలను జిల్లా సర్వోన్నత అధికారుల దృష్టికి తీసుకువచ్చే ఎంతో గొప్ప కార్యక్రమం. కలెక్టరు, జాయింట్ కలెక్టరు స్థాయి అధికారుల చెంతకు తెచ్చిన సమస్యల పరిష్కారానికి నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించే కార్యక్రమం ఇది. దరఖాస్తుదారులకు ఎప్పటిలోగా సమస్య పరిష్కరించబడుతుందో అనే విషయాన్ని తెలపడంతో పాటు, సమస్య పరిష్కారం అయిన వెంటనే వారి చరవాణి (సెల్ ఫోన్)లకు సమాచారం అందించడం ఈ కార్యక్రమం తాలూకా ప్రత్యేకత. వినడానికి ఇదంతా అద్భుతంగా కనిపిస్తున్నప్పటికీ, స్పందనపై ఎక్కువుగా అసంతృప్త రాగాలే వినిపిస్తున్నాయి. ఇతర ప్రభుత్వ శాఖల్లో స్పందన దరఖాస్తుదారులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో తెలియదుగానీ, రెవెన్యూ విభాగం విషయానికి వస్తే మాత్రం అధికశాతం మంది పెదవి విరుస్తున్నారు. దీనికి కారణం సమస్య పరిష్కారం కాకపోగా, పరిష్కారమైనట్లు సమాచారం రావడం వీరిని నివ్వెరపరుస్తోంది. దీంతో మళ్లీ మళ్లీ స్పందన కార్యక్రమానికి అదే సమస్యతో కలెక్టరేట్ మెట్లు ఎక్కాల్సి వస్తోంది. స్పందన దరఖాస్తుల పరిష్కారమైనట్లు జిల్లా సర్వోన్నత అధికారులకు వచ్చే సమాచారంతో వారు సంతృప్తి చెందుతున్నా, అదే సమస్యతో మళ్లీ మళ్లీ దరఖాస్తుదారులు రావడంతో వీరు నివ్వురుపోయే పరిస్థితి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో నెలకొన్నట్లు తెలుస్తోంది. అనేక జిల్లాల కలెక్టర్లు దీనిపై సంబంధిత మండలాల అధికారులను హెచ్చరిస్తున్నా, ప్రస్తుత పరిస్తితులు చూస్తుంటే పెద్దగా మార్పు లేనట్లు కనిపిస్తోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలే ఉండేవి. ఆయా జిల్లాల కలెక్టర్లు పని ఒత్తిడి కావడం వలనో లేదా ఇతర కారణాల వలనో స్పందన దరఖాస్తుల విషయంలో ఏమరుపాటుగా ఉండటంతో మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యం వహించే వారు. ఇప్పుడు 13 జిల్లాలో 26 అయ్యాయి. ఆయా జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు. వారి సారధ్యంలోనే స్పందన కార్యక్రమం ప్రతీ సోమవారం చురుగ్గా జరుగుతోంది. అయినప్పటికీ కలెక్టర్లు ఏం చేస్తారులే అనే నిర్లక్ష్య భావనే మండల స్థాయి అధికారుల్లో నెలకొని ఉన్నట్లు కనిపిస్తోంది. సమస్యను పరిష్కారం చేయకుండానే, సమస్యను పరిష్కారం చేసినట్లు దరఖాస్తుదారుల చరవాణిలకు సమాచారం పంపిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా అనకాపల్లి జిల్లాలోని ఒక స్పందన దరఖాస్తును పరిశీలిద్దాం. అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం పరిధిలోని అనకాపల్లి పట్టణానికి సమీపాన ఉన్న ఒక భూమికి సంబంధించి దరఖాస్తుదారునకు పట్టా నకలు కావల్సి వచ్చింది. గతంలో విశాఖపట్నం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలోనూ ఇదే విషయమై దరఖాస్తు చేశారు. రెండు మూడు సార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేకపోవడం, దానిపై కలెక్టరు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. ఈలోగా విశాఖ జిల్లా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా విభజింపబడటంతో, దరఖాస్తుదారుడు మరోసారి అనకాపల్లి జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నెల 18వ తేదీన నిర్వహించిన స్పందనలో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు నెంబరు  ANPL20220418154 కు సంబంధించి సదరు సమస్యను పరిష్కారం చేసినట్లు అదే నెల 26వ తేదీన దరఖాస్తుదారుడి చరవాణికి సమాచారం అందింది. గమ్మత్తు ఏమిటంటే చరవాణికి సమాచారం వచ్చిన రెండు రోజుల తర్వాత అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం వీఆర్వో దరఖాస్తుదారుడికి ఫోన్ చేసి.. “ఏమిటీ స్పందనకు దరఖాస్తు చేసుకున్నారట. ఏమిటి విషయం అని నిర్లక్ష్యంగా అడిగారు. దీనిబట్టి దరఖాస్తులో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని వారు చదవలేదనే విషయం స్పష్టమౌతోంది. అలాంటప్పుడు దేని ఆధారంగా దరఖాస్తుదారుడి చరవాణికి సమస్య పరిష్కారమైనట్లు పంపారో అనేది ఆ దేవుడికే తెలియాలి. ఇలాంటి సమాచారాలతో జిల్లా సర్వోన్నత అధికారులను బోల్లా కొట్టించడమేగాక, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అనకాపల్లి కలెక్టరు కార్యాలయానికి స్థానికులు మొదలుకొని దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుంచి స్పందన కోసం ప్రజలు వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి అనకాపల్లికి బస్సు లేదా రైలు ద్వారా చేరుకొని, అక్కడ నుంచి ఆటోలు ద్వారా రేబాక శంకరం ప్రాంతానికి చేరుకోవాలి. మళ్లీ అక్కడ నుంచి కలెక్టరేట్ కు కిలో మీటరు దూరం పైగా నడవాలి. ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ, ఆర్థికంగా ఆపసోపాలు పడుతూ స్పందనలో ఇచ్చిన దరఖాస్తులకు ఇలాంటి ప్రతి స్పందనలు వస్తే, దరఖాస్తుదారులకు స్పందన కార్యక్రమంపై ఏమేరకు నమ్మకాలు ఉంటాయో జిల్లా సర్వోన్నత అధికారులే ఆలోచించాలి. ఇకనైనా సమస్యలు పరిష్కారమైనట్లు చూపించే సమాచారం పై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి అందులో నిజానిజాలు పరిశీలించాలని అనకాపల్లి జిల్లా వాసులు కోరుతున్నారు. దీని నిమిత్తం ప్రత్యేకమైన సిబ్బందిని నియమిస్తే స్పందన దరఖాస్తులకు న్యాయం చేసినట్లు అవుతుందని పలువురు అంటున్నారు.