GVMC VSP

“గులాబ్” తుఫాను ప్రభావితానికి అప్రమత్తమైన జివిఎంసి యంత్రాంగం

 నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి 

 జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన  

భారత్ వాయిస్, విశాఖపట్నం, సెప్టెంబర్-27:- విశాఖ నగరాన్ని దాటిన “గులాబ్” తుఫాను ప్రభావిత ప్రాంతాలలో   భాగంగా జివిఎంసి యంత్రాంగం అప్రమత్తంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని జివిఎంసి నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, కమిషనర్ డాక్టర్ జి. సృజన పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ విషయమై సోమవారం నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ అన్నం మల్లిఖార్జున, జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన కలిసి తుఫాన్ ముంపు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ పర్యటనలో ముందుగా 94 వార్డులో కొండ చరియలు విరిగిపడి ఇళ్లు నేలమట్టం కావడంతో ఇంట్లో నివసిస్తున్న భావన అనే మహిళ ప్రాణాలు కోల్పోయినందున, ఆ ప్రాంతానికి చేరి వారి కుటుంబ సభ్యులను  మేయర్, కలెక్టర్, కమిషనర్ పరామర్శించారు. అక్కడ నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు వెంటనే తరలించే ఏర్పాట్లను  చేయాలని కమిషనరుకు మేయర్ సూచించారు. అనంతరం 13వ వార్డులో రామకృష్ణాపురం ముంపు ప్రాంతాల్లో నివాసాల్లోకి చేరిన వరద నీటిని, వ్యర్థాలను తొలగించి ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన జరపాలని చీఫ్ ఇంజనీర్ ను కమిషనర్ ఆదేశించారు. విమానాశ్రయ ప్రాంతాల్లో రెండు అడుగుల మేర నీరు చేరడంతో పది మోటార్ల ద్వారా నీటిని తరలించాలని, మేఘాద్రి గెడ్డ నుండి వచ్చే వరద నీరు విమానాశ్రయం వైపు రాకుండా తగు చర్యలు చేపట్టాలని కమిషనర్ చీఫ్ ఇంజినీరును ఆదేశించారు. తుఫాను హెచ్చరిక కేంద్రం వారి సమాచారం మేరకు 25వ తేదీ నుండే జివిఎంసి యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడం అయిందని మేయర్, కమిషనర్  తెలిపారు. ప్రతి జోన్ లో విపత్తు నివారణ ప్రణాళికలను సిద్ధం చేస్తూ, అన్ని జోన్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్ లను ఏర్పాటు చేయడమైనది అన్నారు. అందరు జోనల్ కమిషనర్ లను, విభాగ అధిపతులను భద్రతా చర్యలు చేపట్టుట కు సిద్ధంగా ఉండాలని వారు ఆదేశించారు.  ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించుటకు టోల్ఫ్రీ నెంబర్లను ప్రజలకు తెలియ పరచడమైనది అన్నారు. జివిఎంసి సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా పబ్లిక్ అనౌన్స్మెంట్, స్మార్ట్ పోల్స్ ద్వారా ప్రకటనలను, సోషల్ మీడియా (ట్విట్టర్, ఫేస్ బుక్) ద్వారా ప్రజలకు సమాచారాన్ని తెలపడం అయినది అన్నారు. తుఫాను ముప్పు గురికాగల 51 ప్రాంతాలను గుర్తించి సురక్షిత ప్రాంతాల్లో 19 పునరావాస కేంద్రాలను కమ్యూనిటీ సెంటర్ నందు కల్యాణమండపాలు నందు ఏర్పాటు చేయడమైనది అన్నారు. ప్రజలను అప్రమత్తం చేయుటకు స్వయం సహాయక సంఘాలు , డ్వాక్రా సంఘాల ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైనది అన్నారు. అవసరమైన చోట నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయడమైనది అన్నారు. భద్రతా చర్యలలో భాగంగా జనరేటర్లు, మోటార్లు, సిబ్బందికి టార్చ్ లైట్ లు, పారిశుద్ధ్య సామాగ్రిని అందుబాటులో ఉంచడమైనది అన్నారు. COVID-19, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. 

ఆదివారం అర్ధరాత్రి గులాబ్ తుఫాను తీరం దాటే సమయానికి నగరంలో 63 ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని అన్నారు. 31 ప్రాంతాల్లో పలుచోట్ల ఇల్లులు, గోడలు కూలిపోగా, ఆస్తి నష్టం 21 ప్రాంతాల్లో జరిగిందన్నారు. 200 పైచిలుకు చెట్లు, కొమ్మలు విరిగి పడగా యుద్ధ ప్రాతిపదికన తొలగించే ఏర్పాట్లు చేయడమైనది అన్నారు. 28 ప్రాంతాల్లో చేరిన వరద నీటిని మోటార్ల ద్వారా తోడిoచి తరలించడం అయినది అన్నారు. యూ సి డి విభాగం ద్వారా 19 పునరావాస కేంద్రాల్లో 1850 మందిని పునరావాసాలకి తరలించి, తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడమైనది అన్నారు.  ముంపుకు గురైన ప్రాంతాలలో ప్రజారోగ్య విభాగం ద్వారా పారిశుద్ధ్య పనులు చేపడుతూ, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించడం అయినది అన్నారు. నీటి సరఫరా విభాగం ద్వారా అంతరాయం లేకుండా ప్రతి ఇంటికి త్రాగు నీటిని సరఫరా చేయడమైనది అన్నారు. పలుచోట్ల అంతరాయం కలిగిన విద్యుత్తును పునరుద్ధరించే చర్యలు చేపట్టడం అయినది అన్నారు. 1310 వీధి దీపాలు దెబ్బతిన్నావన్నారు. ఇంజనీరింగ్ విభాగం ద్వారా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిల్వలను శుభ్రం చేసి వెంటనే పూడ్చే కార్యక్రమం చేపట్టడం అయినది అన్నారు. 47 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రోడ్లను గుర్తించడమైనదన్నారు. 57 కిలోమీటర్ల మేర పొంగిపొర్లుతున్న ఓపెన్ డ్రైవ్లను, యూజీడీ డ్రైన్లను గుర్తించి తగు చర్యలను చేపడుతున్నామన్నారు. ముంపు ప్రాంతాల్లో భద్రత, అవగాహన చర్యలు చేపట్టుటకు గానూ- జోన్, వార్డు, సచివాలయ స్థాయిలో ప్రత్యేక బృందాలను ముందస్తుగా ఏర్పాటు చేయడమైనది అన్నారు.  ఈ గులాబ్ తుఫాను ను ముందే గుర్తించి  భద్రత చర్యలు చేపట్టినప్పటికీ, కొన్ని ముంపు ప్రాంతాల్లో పలుచోట్ల పలు సదుపాయాలకు అంతరాయం కలిగింది అన్నారు. ఈ తుఫాను తీరం దాటినందున ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని , జరిగిన  అంతరాయాలను గుర్తించి తగు చర్యలను ,మౌలిక సదుపాయాలను జివిఎంసి యంత్రాంగం యుద్ధప్రాతిపదికన  చేపడుతుందని నగర మేయర్, కమిషనర్  తెలిపారు. ఇటువంటి విపత్తులు జరిగినప్పుడు నగర ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, జివిఎంసి  యంత్రాంగం  చేపడుతున్న చర్యలకు సహాయ సహకారాలు అందించాలని మేయర్, కమిషనర్ ప్రజలను కోరారు.