జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన
భారత్ వాయిస్, విశాఖపట్నం, సెప్టంబర్-25:- బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారి నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన ఒక ప్రకటనలో తెలిపారు. గంటకు 45 కిలోమీటర్ల నుండి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, తీరం వెంబడి నివసించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, విద్యుత్తు స్తంభాలు, హోర్డింగులు, చెట్లు కొమ్మలు విరిగే అవకాశం ఉన్నందున వాటి కింద ఎవరూ ఉండరాదని, ప్రహరీ గోడలు కూలి ప్రమాదం ఉందని, కొండవాలు ప్రాంత ప్రజలు, పాత భవనాలలో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ ప్రకటనలు ఎప్పటి కప్పుడు వినాలని, కాలువలు, గెడ్డలు పొంగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరెంటు పోయే అవకాశం ఉన్నందున టార్చ్ లైట్ లు సిద్ధం చేసుకొని ఉంచుకోవాలని, ఎటువంటి విపత్తులు సంభవించిననూ జివిఎంసి హెల్ప్ లైన్ నెంబర్ 1800 425 00009, 0891-2869106కు ఫోన్ చేయాలని, అందరూ COVID-19 నిబంధనలు పాటించి, మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “గులాబ్” తుఫాన్ దృష్ట్యా జివిఎంసి ఇంజినీరింగ్ విభాగం, ఉద్యాన విభాగం, ప్రజారోగ్యపు విభాగం అధికారుల నుండి సిబ్బంది వరకు ఎటువంటి సెలవు పెట్టకుండా రాబోవు రెండు రోజులు నగరంలో అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ఉన్నతాధికారులను ఆదేశించారు.