GVMC VSP

లంచాల ఊబిలో జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్

భారత్ వాయిస్, విశాఖపట్నం : జీవిఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో అతి కీలకమైన పోస్టు టిపిబిఓ. టిపిబిఓని విడమర్చి చెప్పాలంటే టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్ సీర్ అని అర్థం. క్షేత్రస్థాయిలో నిబంధనలను అతిక్రమించిన భవన నిర్మాణాల విషయంలో కొరడా ఝులిపించడంలో వీరిదే కీలక పాత్ర. అలాంటి టిపిబిఓలు ఉద్యోగ నిర్వహణలో గతి తప్పుతున్నారు. సక్రమంగా భవనాలు కట్టే వారి కన్నా, మున్సిపల్ ప్లాన్లు లేకుండా భవన నిర్మాణాలు జరిపే వారన్నా, ప్లాన్లను అతి క్రమించి నిర్మాణాలు జరిపే వారన్నా వీరికి అమిత మైన ప్రేమ. అలాంటి నిర్మాణాలు జరిపే ప్రతీ ఒక్కరి నుంచి లక్షలాది రూపాయలు లంచాలుగా గుంజడం అంటే వీరికి అమితానందం. లంచాలు తీసుకున్న అక్రమ నిర్మాణాలపై వీరు కన్నెత్తి కూడా చూడరు. ఒకవేల ఎవరైనా ఫిర్యాదు చేసినా.. వీరు పట్టించుకున్న పాపాన పోరు. ఒక విధంగా చెప్పాలంటే అవినీతి భూతాలన్నీ వీరి చుట్టూనే తిరుగుతున్నాయా అని అనిపించకమానదు. మరి టౌన్‌ప్లానింగ్ విభాగం ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించుకుంటే… కొందరు టిపిబీఓలకు వత్తాసు పాడుతూ లంచాల కలెక్షన్లలో వాటాలు దక్కించుకుంటున్నారా లేక కిందస్థాయి ఉద్యోగుల బాగోతాలు తెలియక ఉంటున్నారా అనే సందేహాలు కలగకమానవు.

జీవీఎంసీ పరిధిలో 8 జోన్లు ఉన్నాయి. అన్ని జోన్ల టౌన్ ప్లానింగ్ విభాగాల పరిధిలోనూ అక్రమ నిర్మాణాలు ఇబ్బడిముడిగా ఉన్నాయి. కాని వాటిపై చర్యలు తీసుకున్న సంఘటనలు చేతి వేళ్లతో లెక్కపెట్టవచ్చు. కొన్ని అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేస్తే టిపిబీఓలు అస్సలు సహించరనీ, అవసరమైతే ఫిర్యాదుదారులపై పోలీసు ఫిర్యాదులు లేదా గూండాలతో బెదిరింపులకు దిగుతారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల టిపిబీఓలుగా పనిచేస్తున్న మహిళల భర్తలే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారనీ, మీడియాకు చెందిన వ్యక్తులను తమ గుప్పెట్లో ఉంచుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాస్తవానికి అక్రమ నిర్మాణాలను గుర్తించడం, వాటి పై చర్యలు తీసుకోవాల్సిందిగా తమ ఉన్నతాధికారులకు సిఫార్సులు చేయాల్సిన బాద్యత టిపిబిఓలదే. అయితే అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటి నిర్మాణదారుల నుంచి లంచాలు గుంజి పర్సంటేజీల వారీగా తమ పై అధికారులకు పంపతుంటారనే అపవాదు లేకపోలేదు. అక్రమ నిర్మాణాలే గాక, నిబంధనలు ప్రకారం అపార్టుమెంట్లుగానీ, వ్యక్తిగత ఇంటి నిర్మాణాలు జరిపిన వారి నుంచి కూడా వీరి మామూళ్లు వీరికి ఇచ్చేయవలసిందేనట. ఒక అపార్టుమెంట్ లో ఎన్ని ప్లాట్లను వేస్తే,ఒక్కో ఫ్లాట్ కి రూ.15 వేలు నుంచి 25 వేలు వరకూ లంచం రూపంలో ఇవ్వాల్సిందేనట. అంటే 20 ఫ్లాట్లను నిర్మించే అపార్టుమెంట్ కి అక్షరాలా రూ. 3 లక్షలు నుంచి రూ. 5 లక్షలు లంచం ఇచ్చుకోవాల్సిందేనట. లేదంటే అనుమతి పత్రమే రాదని ఒక బిల్డర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బిల్డింగ్ సక్రమంగా నిర్మించినా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రావాలన్నా మళ్లీ ఒక్కో ఫ్లాట్ కి కనీసం రూ.5 వేల రూపాయలను లంచంగా సమర్పించుకోవాలట. జీవీఎంసీ పరిధిలో అపార్టుమెంట్లు, ఇండివిద్యువల్ గృహాల నిర్మాణం ఏ స్థాయిలో జరుగుతుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలైన పెందుర్తి, మధురవాడ, కొమ్మాది, ఎండాడ తదితర ప్రాంతాల్లో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో పనిచేస్తే టౌన్ ప్లానింగ్ సిబ్బందిలో కొంతమంది లంచాల భూతాలుగా మారి భవన నిర్మాణదారులకు నరకం చూపిస్తున్నారట. కొంతమంది బిల్డర్లు వీరికి లంచాలు ఇవ్వకపోతే భవన నిర్మాణ అనుమతులు రావనే భావనకు వచ్చేసి, వారు అడిగినంత ఇచ్చేసి పనులు జరిపించేసుకుంటున్నారు. ఇటీవలే జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగానికి చీఫ్ సిటీ ప్లానర్ గా సురేష్ కుమారు బాధ్యతలు స్వీకరించారు. ఉద్యోగ నిర్వహణ విషయంలో చాలా స్ట్రిక్ట్ అనే పేరు గడించారు. దీంతో పెందుర్తి మండలం, ప్రశాంతినగర్ ప్రాంతంలో జరిగిన, జరుగుతున్న కొన్ని అక్రమ నిర్మాణాలపై ఆయనకు స్పందనలో ఫిర్యాదు ఫిర్యాదుపై స్పందించిన ఆయన కింద స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే వారు ఎలాంటి రిపోర్టును సిసిపి గారికి ఇచ్చారో తెలియదుగానీ ఇంతవరకూ అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. మరి తెర వెనుక ఏం జరుగుతుందో చీఫ్ సిటీ ప్లానర్ గారికి, పెందుర్తి జోన్ టౌన్‌ప్లానింగ్ విభాగానికే తెలియాలి.