GVMC VSP

 వీధులలో ఫాగింగ్, స్ప్రేయింగ్ చేయండి

 జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన
భారత్ వాయిస్, విశాఖపట్నం, సెప్టంబర్-25:- అన్ని వీధులలో ఫాగింగ్, స్ప్రేయింగ్ చేయాలని జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన మలేరియా సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆమె 5వ జోన్ 57వ వార్డు కంచరపాలెంలో గౌరీనగర్, సుభాష్ నగర్ పరిసర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెద్ద రోడ్లు ఉన్న వీధులలో మాత్రమే ఫాగింగ్, స్ప్రేయింగ్ చేస్తున్నారని, చిన్న, చిన్న సందులున్న వీధులలో కూడా చేయించాలని మలేరియా ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. గౌరీనగర్ వీధులలో ఉన్న ఇళ్ళకు ఈ నెల 9వ తేదీన మలేరియా సిబ్బంది వచ్చారని, మరల ఇంతవరకు వీధులలో ఉన్న ఇళ్ళను సందర్శించక పోవడంపై ఆ ఏరియా మలేరియా సిబ్బంది జీతం నిలుపుదల చేయాలని ఆదేశించారు. డెంగ్యూ అవగాహన కల్పించు స్టిక్కర్లను ప్రతి ఇంటికీ అతికించలేదని, సిబ్బంది అతికించిన స్టిక్కర్లపై సందర్శించిన తేది, సంతకంతో పాటు, ఆ ఇంటి నివాసితుల సంతకం పెట్టించక పోవడంపై మలేరియా ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుభాష్ నగర్ లో డెంగ్యూ వ్యాధి సోకిన ఇంటికి వెళ్లి ఆ పరిసరాలను పరిశీలించి, ఆ ప్రాంతాలలో ఫాగింగ్, స్ప్రేయింగ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గౌరీ నగర్ లో దివ్యాంగ పింఛన్ ఒక సంవత్సరం నుండి అందలేదని దివ్యాంగుడు తెలుపగా పరిశీలించి వెంటనే పింఛన్ వచ్చే ఏర్పాటు చేయాలని కమిషనర్ యు.సి.డి. సిబ్బందిని ఆదేశించారు. ఈ పర్యటనలో ఐదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, రత్నాల రాజు, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు శ్రీనివాస రావు, కోటేశ్వర రావు, ఎఎంఒహెచ్ డాక్టర్ రాజేష్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ విజయ్ కుమార్, వార్డు ప్రత్యేక అధికారి అన్నం నాయుడు, శానిటరీ సూపర్వైజర్ కిషోర్, మలేరియా ఇన్స్పెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.