GVMC VSP

75, 76 వార్డులలో జివిఎంసి కమిషనర్ పర్యటన

భారత్ వాయిస్ , విశాఖపట్నం, ఫిబ్రవరి-15:- మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మిశ మంగళవారం 6వ జోన్ లోని 75, 76 వార్డుల పరిధిలో పెదగంట్యాడ, దాసర వీధి, సీతానగర్, “వై” జంక్షన్, కణితి రోడ్డు, ఎస్.టి. కోలనీ, రామచంద్ర నగర్ తదితర ప్రాంతాలలో ఆయా వార్డు కార్పొరేటర్లు పి. లక్ష్మి భాయి, జి. శ్రీనివాస రావు తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెదగంట్యాడ బొటిక్ షాపుకు ఎదురుగా నిర్మిస్తున్న భవనమునకు చుట్టూ స్థలం వదలలేదని ఆ భవనం యొక్క ప్లాను పరిశీలించాలని అసిస్టెంట్ సిటీ ప్లానర్ ను ఆదేశించారు. ఆ ప్రాంతంలో ప్రధాన పైపు నీరు లీకు అవుతుండడంతో సంబందిత అసిస్టెంట్ ఇంజినీరు పై చర్యలు తీసుకోవాలని కార్యనిర్వాహక ఇంజినీరును ఆదేశించారు. సీతానగర్ లో పాడైన భవనాన్ని శుభ్రపరచాలని, లోతట్టు ప్రాంతాల ప్రధాన కాలువల మురుగు, వర్షం నీరు పోతున్నందున ప్రత్యామ్నాయం చూడాలని ఇంజినీరింగ్ అధికారులను అదేశించారు. “వై” జంక్షన్ రోడ్డులో చాలాకాలం నుండి వినియోగంలో లేని వాహనాలు, రోడ్డు మార్జిన్ లో పాత పైపులు ఉన్నాయి, వాటిని వెంటనే తొలగించాలని, కణితి రోడ్డులో ఆక్రమణలను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఎస్.టి. కోలనీలో పందులు సంచారం అధికంగా కనిపిస్తున్నాయని వాటిని నిర్మూలించాలని, భూ గర్భ డ్రైనేజి గోతులను పూడ్చాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న గెడ్డలో వ్యర్ధాలు తొలగించాలని, డైరీ కోలనీ పార్కు- 2 చుట్టూ మొక్కలు నాటారు. డంపింగు యార్డు ప్రహరీ గోడ ప్రక్కన వరుసగా మొక్కలు నాటించమని అధికారులను ఆదేశించారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీలో పాల్గొని, స్వచ్ఛ సర్వేక్షణ్ పై ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులతో కలసి పనిచేసి ప్రజలకు అవగాహన కల్పించాలని, కార్యదర్శులందరూ స్వచ్ఛ సర్వేక్షణ్ పై అవగాహన కలిగి ఉండాలని, యూజర్ చార్జీల వసూలను వేగవంతం చేయాలని సూచించారు. డంపింగు యార్డులో మొక్కను నాటారు.

75వ వార్డులో దాసరి వీధిలో ఎపిఐసిసి వారి ప్రహారీ గోడ వలన మురుగు నీరు పోయే మార్గం లేదని, వారితో మాట్లాడి మురుగు పోయే మార్గం సరి చేయాలని, పెదగంట్యాడ దాసరి వీధిలో స్మశాన వాటికలో మౌళిక వసతులైన విద్యుత్, త్రాగు నీరు, వాచ్ మెన్ ను ఏర్పాటు చేయాలని, వార్డులోని ప్రజలకు సచివాలయం దూరంగా ఉన్నందున సచివాలయ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మార్పుచేయాలని, నూతనంగా మంచి నీటి ట్యాంకు, కమ్యునిటీ హాలు, సిసి రోడ్డు, డ్రైన్లు మీద పైకప్పులు నిర్మించాలని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అభివుద్ధి పరచాలని కార్పొరేటర్ కమిషనర్ కు తెలిపారు. 76వ వార్డులో “వై” జంక్షన్ వద్ద పిపిపి పద్దతిలో అభివృద్ది పరిచిన పార్కు మధ్యలోనే ఆగిపోయిందని ఆ పార్కును పున:ప్రారంభించాలని, గంగవరం పోర్టు వెళ్ళే ప్రధాన రహదారి బాగోలేఅనందున గంగవరం పోర్టు యాజమాన్యం ఆర్&బి వారితో మాట్లాడి రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని, డైరీ కోలనీ, నడుపూర్, గాంధీ పార్కు, హౌసింగ్ బోర్డు తదితర పార్కులలో విద్యుత్ సౌకర్యం, వాకింగ్ ట్రాక్, సుందరీకరణ పనులు, వాచ్ మెన్ ను తదితర పనులు చేపట్టాలని కార్పొరేటర్ కమిషనర్ కు తెలిపారు. 75, 76 వార్డులలోని ప్రతి సమస్య పరిష్కరిస్తామని ఆయా కార్పోరేటర్లకు కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కెఎస్ఎల్ జి శాస్త్రి, జోనల్ కమిషనర్ శ్రీధర్, కార్యనిర్వాహక ఇంజినీరు ప్రసాద బాబు, ఎసిపి రమణ మూర్తి, ఎఎంఒహెచ్ కిరణ్ కుమార్, ఉప కార్వనిర్వాహక ఇంజినీరు, అసిస్టెంట్ ఇంజినీరు, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.