POLICE

కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి

గౌతం సవాంగ్‌ పై బదిలీ వేటు
ఉద్యోగుల చలో విజయవాడ ఎఫెక్ట్

భారత్ వాయిస్ : ఉద్యోగ నిర్వహణలో ఏమాత్రం తేడా వచ్చినా దాని ఫలితం తీవ్రంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అది ఏ స్థాయీ ఉద్యోగి ఐనా సరే.
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్‌ పై బదిలీ వేటుపడింది. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ని కొత్త డీజీపీగా జగన్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ గా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం సవాంగ్‌కు ఆదేశించింది. ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని నిరసన తెలిపారు. దీనికి పోలీసుల వైఫల్యమే కారణమని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్‌ను బదిలీ చేయాలని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చారు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ బదిలీ గురించి వీరు చర్చించినట్టు సమాచారం. దీనిలో భాగంగా రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.