POLITICAL

“అమర్‌”కు మంత్రి పదవి ఖాయం..!

యువకుడు, కాపు సామాజికవర్గం
వాగ్దాటి, చురుకైనవాడు
పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా మోసినవాడు
వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి ఆశీస్సులు పుష్కలం..

 భారత్ వాయిస్, విశాఖపట్నం :   విశాఖ జిల్లాలోని ప్రస్తుత రాజకీయాల్లో ఆయనొక పాశుపతాస్త్రం. ప్రత్యర్థి పార్టీలకు ఆయన ఒక సింహ స్వప్నం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేతగానీ, లోకల్ నాయకులుగానీ వైసీపీ పార్టీ మీదగానీ ఆ పార్టీ అధినేత పైనగానీ బురద జల్లే కార్యక్రమాలకు పూనుకుంటే చాలు, అతనికి ఒక్కసారిగా పూనకం వచ్చేస్తుంది. ప్రత్యర్థులు తిరిగి సమాధానం ఇవ్వలేని రీతిలో విరుచుకుపడిపోతాడు, తన వాగ్దాటితో ఉక్కిరిబిక్కిరి చేసేస్తాడు. వారికి కంటి మీద కునుకు లేకుండా చేసేస్తాడు. ఇవన్నీ ఒక ఎత్తయితే, పార్టీ ఒకప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా మోయడంలో అధినేత మన్ననలను పొందాడు. ఆర్థికంగా పెనుసవాలుతో కూడినప్పటికీ తన ఆర్థిక స్తోమతతో ఎక్కడా ఏ లోటూ లేకుండా చేయగలిగాడు. ఇది అతని నిబద్దతకు నిదర్శనం. ఇంతవరకూ జిల్లా రాజకీయాల వరకే పరిమితమైన ఈ పాశుపత్రాస్త్రం రాబోయే మంత్రి వర్గంలో చోటు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఈ పాశు పతాస్త్రం ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై కూడా తన ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అతనెవ్వరో కాదు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్.

                      పుట్టుకతోనే రాజకీయ రక్తంతో నిండిపోయిన శరీరం అది. తండ్రి గుడివాడ గురునాథరావు మూడు నాలుగు దశాబ్దాలు క్రితం కాంగ్రెస్ పార్టీలో గొప్ప నాయుకుడు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అదే పార్టీకి చెందిన అపర చాణుక్యుడిగా పేరు ప్రఖ్యాతులు గడించిన కీర్తిశేషులు ద్రోణంరాజు సత్యనారాయణకు అనుంగ శిష్యుడు ఆయన. ఒక్కసారి పరిచయం అయితే చాలు ఏ స్థాయి కార్యకర్తనైనా పేరు పెట్టి పిలిచే గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడి కడుపున పుట్టిన అమర్నాథ్ కూడా తండ్రి రాజకీయ లక్షణాలను అంది పుచ్చుకున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. తండ్రి మరణానంతరం తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ, అక్కడ ఇమడలేని స్థితిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అమర్ కి వైకాపా పార్టీ ఆవిర్భవించడంతో ముందూ వెనుక చూడకుండా ఆ పార్టీ కండువా కప్పేసుకున్నాడు. అమర్ చురుకుదనం, రాజకీయ కుటుంబ నేపథ్యం గమనించిన వైకాపా అధినేత జగన్ ఆయనకు మంచి ప్రాధాన్యతే కల్పించారు. విశాఖ జిల్లా అధ్యక్షుడి పగ్గాలు అప్పగించారు. అంతే అక్కడి నుంచి అమర్ అంటే ఏంటో జిల్లా రాజకీయ వాసులకు తెలిసింది. కాంగ్రెస్ పాలనలో తీసుకున్న రాష్ట్ర విభజన అంశంపై అలుపెరగని పోరాటం చేశారు. 2014వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో వైకాపా ఓటమి పాలైనప్పటికీ అదే అమరకు కలిసివచ్చిందని చెప్పాలి. అధికార పార్టీ తీసుకునే తప్పుడు నిర్ణయాలపై జిల్లాస్థాయిలో విరుచుకుపడేవారు. తన వాగ్దాటితో ప్రతిపక్షాల నాయకులు నోళ్లు మూయించేవారు. అవసరమైతే తన నాయకత్వంలో జరిపిన ఆందోళనలను రాష్ట్రస్థాయిలో మారుమ్రోగేలా సత్తా చాటారు. కాలం గడిచే కొద్దీ అమర్ లేని
                        వైకాపాను జిల్లాలో ఊహించడం కష్టమైపోయింది పార్టీ అగ్ర నేతలకు. 2019వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి టికెట్ అందుకున్న అమర్ విజయ బావుటాను ఎగురవేశారు. మంత్రివర్గ విస్తరణలో మొదటి దశలోనే అమరు ఛాన్స్ దక్కుతుందని అంతా భావించారు. అయితే కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల ఆయనకు చుక్కెదురైంది. అయితే రెండవ దశ మంత్రి వర్గ విస్తరణలో అమరకు తప్పనిసరిగా చోటు దక్కుతుందనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. వైకాపా ప్రభుత్వం జనరంజకమైన పాలనను అందిస్తున్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతీ అంశాన్ని బురద జల్లేడి కార్యక్రమంగా తీసుకుంటోంది. ఉద్దేశ పూర్వకంగా చెడు కార్యక్రమాలకు పాల్పడి, వాటిని వైకాపా ప్రభుత్వంపై తోసేయడం చేస్తోంది. అయితే వీటన్నింటినీ సమర్థవంతంగానే అడ్డుకుంటున్న వైకాపాకు ప్రతిపక్షం నోళ్లు మూయించే సత్తా ఉన్న నాయకులు జగన్ మంత్రుల్లో కరువయ్యారు. కొడాలి నాని, పేర్ని నాని మినహా మరెవ్వరూ లేరనే చెప్పాలి. ఉద్రేకపూరితంగా మాట్లాడటం వేరు, ప్రతిపక్షాల నోళ్లు మూయించే విధంగా విరుచుకుపడటం వేరు. ఆ సత్తా ఉన్న నాయకుడు అమర్ నాథ్ అని చెప్పడమే కాదు. ఆయనలోని ఈ శక్తిసామర్థ్యాలను కూడా వైకాపా అధిష్టానం గుర్తించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత మంత్రి వర్గ విస్తరణలో జిల్లా నుంచి వినిపిస్తున్న రెండు పేర్లలో ఒకటి గుడివాడ అమర్ నాథ్ ది. అమర కున్న దూకుడు, సమయ స్పూర్తి, వాగ్దాటి, పార్టీ అభివృద్ధి కోసం శ్రమించే మనస్తత్వం, పార్టీ ఆవిర్భావం నుంచి శ్రమిస్తున్న తీరు.. ఇవన్నీ మంత్రి పదవి దక్కించుకునేందుకు ప్లస్ పాయింట్లే అని చెప్పాలి. కష్టపడేవారిని గుర్తించడంలో ముఖ్యమంత్రి జగన్ ముందుంటారనేది అందరికీ తెలిసినదే. అయితే రాజకీయ సమీకరణాలు కారణంగా కాస్త ముందు.. వెనుక అవుతోంది. ఇలాంటి పరిస్తితిలో త్వరలో చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణలో గుడివాడ అమర్‌కు మంత్రి పదవి దక్కితే, ‘కాంగ్రెస్’ అనే పదం గుడివాడ కుటుంబానికి అచ్చొచ్చినట్లే.