ఓట్ల లెక్కింపు పై గత కొంత కాలంగా ఉన్న సస్పెన్స్ కు హైకోర్టు తెరదించింది.
సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును, హైకోర్టు డివిజన్ బెంచ్ తోసిపుచ్చి ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ ఎన్నికలను సమర్థించిన హైకోర్టు.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను తోసిపుచ్చింది.
ఈ ఏడాది ఏప్రిల్ 1న ఎస్ఈసీ నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఏప్రిల్ 8న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి మే 21న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి నిర్వహించేందుకు తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు తిరిగి ఎన్నికల కోడ్ విధించాలని స్పష్టంచేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎస్ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టులో అప్పీళ్లు వేశారు. వాటిపై ఆగస్టు 5న విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఓట్ల లెక్కింపునకు పచ్చజెండా ఊపుతూ ఈరోజు తీర్పును వెల్లడించింది.