Uncategorizedఆరోగ్యం

నిబంధనలకు విరుద్ధంగా ‘బదిలీల ప్రక్రియలో పదోన్నతుల హంగామా’

భారత్ వాయిస్, విశాఖపట్నం :

బదిలీల సమయంలో ‘పదోన్నతులు’ చేపట్టగూడదు అనేది ప్రభుత్వ నిబంధన. అయితే ఈ ఆదేశాలను తుంగలో తొక్కేసి కొంతమంది సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లగా పదోన్నతులు కల్పించేందుకు విశాఖపట్నం ఆర్డీ (రీజనల్ డైరక్టర్) కార్యాలయం అధికారులు తెగ ఆరాట పడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారికి ఆ ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర పేరును తెర మీదకు తీసుకువచ్చేస్తున్నారు. బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేసే ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ నిజంగానే ఆదేశాలు జారీ చేశారా…లేక ఆయన పేరు చెప్పి ఇక్కడి అధికారులే తతంగం నడిపిస్తున్నారా అనే ప్రశ్నలు ఇక్కడి ఉద్యోగ వర్గాలను వెంటాడుతుండటం గమనార్హం. ఆర్డీ కార్యాలయం అధికారుల ఆరాటం వెనుక కూడా పెద్ద పెద్ద కారణాలే ఉన్నట్లు తెలిసింది. ఈ ఆరోపణల వివరాల్లోకి వెళ్తే…
విశాఖపట్నం ఆర్డీ కార్యాలయం పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. ఆ కార్యాలయం పరిధిలో 32 సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. వాటిలో మూడు ప్రస్తుతం ఖాలీగానే ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల ప్రక్రియలో ఆయా మూడు స్థానాలను భర్తీ చేసేందుకు వీలుంది. బదిలీ మార్గదర్శకాలు ప్రకారం ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వారందరినీ బదిలీ చేయాలని ప్రభుత్వం ఆ మార్గదర్శకాల్లో పేర్కొని ఉంది. అలాగే రికగ్నైజ్ సర్వీసు అసోసియేషన్ లోని ఆఫీసు బేరర్లకు మొత్తం 6 సంవత్సరాల వరకూ మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఫిబ్రవరి 7, 2022 నాటికి 5 సంవత్సరాల సర్వీసు పూర్తయిన చోటును వేకెంట్ గా చూపించాలి. ఈ మార్గదర్శకాల ప్రకారం సూపరింటెండెంట్ల సీనియారిటీ జాబితాలో విశాఖపట్నం జిల్లాలోనే పనిచేస్తున్న ముగ్గురు పేర్లు ఉన్నాయి. ఈ బదిలీల్లో వారికి తప్పకుండా స్థానచలనం కలగనుంది. అయితే వారిని విశాఖపట్నంలోనే ఉంచాలనే ఉద్దేశమో.. లేక మరే ఇతర కారణమోగానీ… సీనియర్ అసిస్టెంట్లకు, పదోన్నతులు కల్పించడం ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని ఆ మూడు ఖాలీలను భర్తీ చేసేందుకు విశాఖపట్నం ఆర్డీ కార్యాలయం అత్యుత్సాహం చూపుతున్నట్లు తెలిసింది. దీని కారణం ఏంటనేది ఆర్డీ కార్యాలయం అధికారులకే తెలియాలి. అయితే ఆర్డీ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారం తెలుసుకున్న ఒక యూనియన్ నాయకులు బదిలీల సమయంలో పదోన్నతులు ఏంటని ప్రశ్నించగా.. ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర ఆదేశాలు మేరకే తాము పదోన్నతుల ప్రక్రియను చేపట్టినట్లు విశాఖపట్నం ఆర్డీ స్వరాజ్యలక్ష్మి తెలిపారని సదరు యూనియన్ నాయకులు చెబుతున్నారు. బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేసే ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ నిజంగానే ఆదేశాలు జారీ చేశారా…లేక ఆయన పేరు చెప్పి ఇక్కడి అధికారులే తతంగం నడిపిస్తున్నారా అనే ప్రశ్నలు ఇక్కడి ఉద్యోగ వర్గాలను వెంటాడుతుండటం గమనార్హం. వాస్తవానికి ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ తీసుకునే ఏ నిర్ణయమైనా కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కాటమనేని భాస్కర్ కు తెలిసే అవకాశం ఉంది. బదిలీల సమయలో జరుగుతున్న పదోన్నతుల తతంగంపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. ఇదే విషయం పై రీజినల్ డైరెక్టర్కు ఫోన్ చేయగా ఆమె ఈ విధంగా తలిపారు. ప్రిన్సిపాల్ హెల్త్ సెక్రటరీ ఫోన్ ఆదేశాలు మేరకే ఈ పదోన్నతులు చేపట్టినట్లు ఆమె చెప్పారు. .