Uncategorized

పరిషత్ ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించాలి :జిల్లా కలెక్టర్ డా. ఏ.మల్లికార్జున

విశాఖపట్నం, సెప్టెంబర్ 17: 19వ తేదీన నిర్వహించే ఎంపీటీసీ జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా చేసుకోవాలని జిల్లా కలెక్టరు ఏ. మల్లికార్జున ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని 39 మండలాల ఎన్నికల అధికారులతో ఆయన మాట్లాడారు. ఏ చిన్న పొరపాటు కు తావివ్వకుండా పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ఉండాలన్నారు. లెక్కింపు ఉదయం 8 గం.కు మొదలవుతన్నందున ఏజెంట్ లతో సహా ఎన్నికల సిబ్బంది అందరూ ఉదయం 6 గం. హాజరు కావాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ లను తెరవడం అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో జరగాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ లను సాయంత్రం వరకు అనుమతించవచ్చు అన్నారు. హాజరయ్యే వారందరూ కరోనా నిబంధనలను పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బి. కృష్ణారావు మాట్లాడుతూ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పరిమితికి మించి ఎక్కువమందిని లెక్కింపు కేంద్రం వద్దకు అనుమతించకూడదన్నారు. ఎటువంటి సమస్య అయినా తక్షణం స్పందించాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి ఐ టి డి ఎ ప్రాజెక్టు అధికారి ఆర్. గోపాలకృష్ణ జిల్లా పరిషత్ సీఈఓ నాగార్జున సాగర్ ఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు ఎస్ డి సి అనిత డి ఆర్ ఓ శ్రీనివాస మూర్తి,ఆర్డీవోలు పెంచల కిషోర్ సీతారామారావు గోవిందరావు వివిధ మండలాల ఆర్ వో లు ఏ ఆర్ వో లు తదితరులు పాల్గొన్నారు.